News

కోటప్పకొండ తిరునాళ్లకు రూ.30 లక్షలు మంజూరు

150views

కోటప్పకొండ తిరునాళ్లకు‌ రాష్ట్ర ప్రభుత్వం 30 లక్షల రూపాయలను మంజూరు చేసిందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. పల్నాడు జిల్లా నరసరావు పేట రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కోటప్పకొండ లో వేంచేసి ఉన్న త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనాలు అందుకున్నారు. అనంతరం రానున్న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పల్నాడు జిల్లా ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ, వీఐపీ పాసుల విషయంలో గత అనుభవాల దృష్ట్యా వీఐపీ టికెట్లు మంజూరు చేయనున్నామని మంత్రి ఆనం తెలిపారు. వీఐపీ దర్శన టికెట్ల ఫిబ్రవరి 10 నుంచి 14 వరకూ ఆన్ లైన్ లో సైతం బుక్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. వీఐపీలు వాళ్లకు ఇచ్చిన టైం స్లాట్ లో మాత్రమే దర్శనం చేసుకునేలా చూడాలన్నారు.

త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి మహాశివరాత్రి పర్వదినాన స్వామి వారి ప్రసాదం ఒక ఉచిత లడ్డూ అందజేస్తామన్నారు. క్యూ లైన్లలో భక్తులు ఎక్కువగా వేచి చూడకుండా త్వరగా దైవ దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేయాలన్నారు.అలాగే మహాశివరాత్రి కోటప్పకొండ తిరునాళ్ల నిర్వహణకు రూ.30 లక్షలు మంజూరు చేయనున్నామని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు.

మహాశివరాత్రి పర్వదినానికి కోటప్పకొండకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని క్యూ లైన్లను శాస్త్రీయంగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. వృద్ధులు, వికలాంగులు, మహిళలు, పిల్లలకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసి, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా త్వరితగతిన స్వామివారి దర్శనం కలిగేలా క్యూ మేనేజ్‌మెంట్‌ను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ఆలయ పరిసరాలు, కొండ మార్గాలు, క్యూ లైన్ల ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు నిరంతరంగా చేపట్టాలని, ఎక్కడా చెత్త పేరుకుపోకుండా ప్రత్యేక పారిశుద్ధ్య బృందాలను నియమించాలని సూచించారు.

అలాగే తాగునీరు, మరుగుదొడ్లు, వైద్య శిబిరాలు, అంబులెన్స్‌లు, ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా చూడాలని తెలిపారు. మహాశివరాత్రి రోజున రాత్రి పూట భక్తులు కొండపైనే ఉండే అవకాశం ఉన్నందున, భద్రతా చర్యలు మరింత చేయాలని, పోలీసు, రెవెన్యూ, దేవాదాయ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

భక్తుల భద్రతే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అని, ప్రతి విభాగం పూర్తి బాధ్యతతో విధులు నిర్వహించాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. మహాశివరాత్రి పర్వదినాన్ని భక్తులు ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు.అన్ని శాఖలు సమన్వయంతో కలిసి ముందుకు వెళ్లాలని అధికారులకు ఆదేశించారు