News

సంప్రదాయ విలువలు తరతరాలకు అందించాలి : మోహన్ భాగవత్

214views

భారతీయ విలువలే రక్షా కవచం. ఆ సంప్రదాయ విలువలు తరతరాలకు అందించాలంటే మాతృభాషలో విద్య తప్పనిసరి. ఆంగ్లం కోసం పోటీపడుతూ స్థానిక భాషలను నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరం’ అని రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ -ఆరెస్సెస్‌ సర్ సంఘచాలక్ మోహన్‌ భాగవత్‌ అన్నారు. ఆరెస్సెస్‌ వందేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా వివిధ రంగాల్లోని అనుభవజ్ఞులతో విజయవాడలో నిర్వహించిన ‘భవిష్య భారతం- దృష్టి దిశ’ సదస్సులో భాగవత్‌ ముఖ్య అతిథిగా పాల్గొని, మాట్లాడారు. ‘పిల్లలు భారతీయ భాషల్లో చదివితే సంస్కృతి, భావోద్వేగాలు, నైతిక విలువలు సహజంగా అబ్బుతాయి. ఈ మార్పు ప్రతి కుటుంబం నుంచి మొదలవ్వాలి. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహిస్తే స్థానిక ఉపాధి, ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుంది’ అని స్పష్టంచేశారు.
సజ్జనశక్తి ఏకమవ్వాలి..

‘మన దేశం, ధర్మం, సమాజంపై అనేక కుట్రలు జరుగుతున్నాయి. అడ్డుకోవాలంటే సజ్జనశక్తి ఏకమవ్వాలి’ అని భాగవత్‌ అన్నారు. ‘దేశం కోసం నిజాయతీగా పనిచేసే ప్రతి ఒక్కరూ సజ్జనశక్తిలో భాగమే. సంఘటిత సమాజ శక్తితో ధర్మాన్ని రక్షిస్తూ, దేశాన్ని గౌరవ శిఖరాలకు చేర్చే శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుతున్నా. మన దేశంలో చెడుకంటే మంచి 40 రెట్లు ఎక్కువ జరుగుతున్నా.. అది వెలుగులోకి రావడంలేదు. మంచి పనుల వెనుక ఉన్నదే సజ్జనశక్తి. దీన్ని సవ్యదిశలో పెడితే దేశంలో భారీ మార్పులు వస్తాయి. అందుకే సంస్థాగత విస్తరణ అవసరం. దేశ జనాభా 142 కోట్లపైగా ఉన్నా.. సంఘటితంగా ఉన్నవారు తక్కువే. దీన్ని విస్తరించాల్సి ఉంది. సజ్జనశక్తి ద్వారా హిందూ సమాజ బలం, హిందుత్వం బలం అందరికీ చెప్పాలి’ అని పేర్కొన్నారు.

ఆరెస్సెస్‌ను అర్థం చేసుకోవాలంటే దూరం నుంచి కాదు.. లోపలికి వచ్చి వాస్తవాలు తెలుసుకోవాలని భాగవత్‌ అన్నారు. ‘‘సమాజ శ్రేయస్సుకు మాత్రమే పనిచేసే స్వార్థ రహితులు, ప్రజలతో ప్రత్యక్ష సంబంధం ఉన్నవారు సంఘటితం కావాలి. అలాంటి వారిని తీర్చిదిద్దడమే ఆరెస్సెస్‌ ప్రధాన లక్ష్యం. దీన్నే ‘వ్యక్తి నిర్మాణం’ అంటారు. ఇలాంటి వ్యక్తులతో దేశంలో అన్నీ సజావుగా సాగుతాయి. హిందూ భావన అంటే ఇతరుల మార్గాలను గౌరవించడం, అన్ని మార్గాలనూ సత్యంగా అంగీకరించడం.. ఇదే భారత సంప్రదాయం. ధర్మం అంటే కేవలం మతం కాదు. జీవన విధానం. కలిసి జీవించడం, కలిసి అడుగులు వేయడం, కలిసి ముందు సాగడం ఇదే ధర్మం. ఈ భావన ఆధారంగానే భారతీయ జీవన సంప్రదాయం రూపుదిద్దుకుంది. హిందుత్వం అంటే ఏకత్వ భావన. ఈ సత్యాన్ని మన రుషులు అనుభవంతో గ్రహించారు. దీని ఆధారంగా ఏర్పడిన జీవనధారే భారతీయ సంస్కృతి. అందుకే.. చరిత్రలో ఎన్నో దాడులు, మార్పులు వచ్చినా మన దేశం మౌలికమైన ధర్మ భావనను ఏనాడూ వదల్లేదు. అదే భారతీయ ధర్మ పరంపర బలం’’ అని వెల్లడించారు.

ఆరెస్సెస్‌ ప్రాంత సహ సంపర్క్‌ ప్రముఖ్‌ రాఘవేంద్ర అధ్యక్షతన సదస్సులో దక్షిణ మధ్య క్షేత్ర సహ సంఘ్‌ చాలక్‌ డి.రామకృష్ణ, ప్రాంత సంఘ్‌ సంచాలక్‌ ఎన్‌.హరికుమార్‌రెడ్డి, ఆరెస్సెస్‌ ప్రతినిధులు మోహన్, మురళీకృష్ణ, రామకృష్ణ, భరత్‌కుమార్, వెంకటేశ్, వేణుగోపాల్‌ నాయుడు, విజయ ఆదిత్య తదితరులు పాల్గొన్నారు. సదస్సుకు హాజరైన వారి ప్రశ్నలకు  సమాధానాలు చెప్పారు. వేదిక వద్ద ‘వందేళ్ల ఆరెస్సెస్‌ ప్రస్థానం’పై చిత్ర ప్రదర్శన, ఏవీ ఏర్పాటు చేశారు.