
ప్రపంచానికి భారత దేశం మార్గనిర్దేశనం చేయాలంటే అంతర్గతంగా బలంగా అవ్వాలని, దీని కోసం సంఘ్ వంద సంవత్సరాలుగా అవిశ్రాంతంగా పనిచేస్తూనే వుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే అన్నారు. దేశాన్ని అంతర్గతంగా బలోపేతం చేయడానికి సమాజంలోని సజ్జన శక్తి ఐక్యంగా కదలాలని, ఇందు కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దేశంలోని గొప్ప వ్యక్తుల జయంతి వేడుకలను సామరస్యంతో కలిసి జరుపుకోవాలని, అప్పుడే దేశం బలంగా మారుతుందన్నారు. అంతేకాకుండా దేశంలో వున్న కుల విభజన కూడా రూపుమాపినట్లు అవుతుందన్నారు.
సంఘ్ కార్య శతాబ్దిని పురస్కరించుకొని హర్యానాలో ‘‘సామాజిక పరివర్తనలో సజ్జన శక్తి పాత్ర’’ అనే అంశంపై గోష్ఠి జరిగింది. ఈ సందర్భంగా హోసబళే మాట్లాడుతూ ప్రాచీన కాలంలో భారత దేశాన్ని స్వర్ణమయ భారత్ (సోనేకి చిడియా) అని పిలిచేవారని, అలాగే విదేశీ దురాక్రమణలదారుల పదే పదే చేసే దండయాత్రలను కూడా ప్రజలు భరించారన్నారు.
1600 ADలో, ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంగ్లాండ్‌లో స్థాపించబడినప్పుడు, అంతర్జాతీయ వాణిజ్యంలో భారత్ వాటా 23 శాతంగా ఉండేదని, దీని ద్వారా మన ఆర్థిక వ్యవస్థ ఎంత పటిష్టంగా వుండేదో తెలుస్తుంద్నారు. మన జ్ఞానం, సంప్రదాయం మరియు సంస్కృతి అన్ని ఇతర దేశాల కంటే ఉన్నతమైనవని అన్నారు. ప్రపంచమంతా ఒకే కుటుంబంగా భావించే సంస్కృతి మనదని, దేశంలోని అన్ని మతాలు, సంప్రదాయాలు, ఆచారాలు కూడా తమవేనని మనం భావిస్తామని అన్నారు.
చివరికి చీమలో కూడా ఈశ్వరుడ్ని చూసే గుణం మనదని, కానీ.. విదేశీ దండయాత్రల కారణంగా కులం, వర్గం, ఆధారంగా విభజన అయిపోయిందని, దీని కారణంగా దీర్ఘకాలికంగా బానిసత్వంలో మగ్గిపోయామన్నారు. అయితే చివరికి స్వాతంత్రం సంపాదించుకున్నామని, కానీ.. ఇంకా వలసవాద తత్వం నుంచి బయటపడలేకపోతున్నామని, దీంతో ఆత్మ విశ్వాసాన్ని కోల్పోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని తిరిగి పొందడానికి సమాజంలోని సజ్జన శక్తి ముందుకు వచ్చి, ప్రయత్నాలు చేయాలని పిలుపునిచ్చారు.
మరో వైపు సంఘ కార్యం గురించి చెబుతూ.. సమాజ హితం కోసం గత వంద సంవత్సరాలుగా సంఘ్ పనిచేస్తూనే వుందని, అందులో భాగంగా వ్యక్తి నిర్మాణంలో నిమగ్నమై వుందన్నారు. అయితే యువతకు సరైన మార్గం చూపించడానికి విలువలను పెంపొందించడం, సంస్కృతిని ఆచరించేలా ప్రోత్సహించడం, సామాజిక దురాచారాలను నిర్మూలించే విషయంలో పౌరులను తయారు చేసే బాధ్యత సమాజంపై కూడా వుందని గుర్తు చేశారు. దీని కోసం సమాజనంలోని సజ్జన శక్తి చొరవ తీసుకోవాలని కోరారు.





