News

శబరిమలకు పోటెత్తుతున్న అయ్యప్ప స్వాములు

246views

మకర సంక్రాంతి దగ్గర పడుతుండటంతో కేరళలోని శబరిమలకు అయ్యప్ప స్వాములు పోటెత్తుతున్నారు. దీంతో ఆ ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. అలాగే మకరవిళక్కు సీజన్ సమీపిస్తుండటంతో స్వామివారిని దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుంచి అయ్యప్ప మాలధారులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. దీంతో శబరిమల కొండలు అయ్యప్ప నామస్మరణతో మారుమోగుతున్నాయి. భక్తుల రద్దీ విపరీతంగా పెరగడంతో దర్శన క్యూలైన్లు కిలోమీటర్ల మేర విస్తరించాయి. సన్నిధానం (ఆలయం) నుండి మొదలైన క్యూలైన్లు కొండ కింద ఉన్న పంబా నది వరకు చేరుకోవడం అక్కడి రద్దీ తీవ్రతకు అద్దం పడుతోంది.

ప్రస్తుతం స్వామివారి దర్శనానికి గంటల తరబడి సమయం పడుతుండటంతో భక్తులు క్యూలైన్లలోనే వేచి ఉండాల్సి వస్తోంది. రద్దీని నియంత్రించేందుకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు, కేరళ పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పంబా నది నుంచి సన్నిధానం వెళ్లే మార్గంలో భక్తులను విడతల వారీగా అనుమతిస్తున్నారు. రద్దీ కారణంగా నిలక్కల్ బేస్ క్యాంప్ వద్ద వాహనాల పార్కింగ్ నిండిపోవడంతో, ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నారు. క్యూలైన్లలో ఉన్న భక్తులకు తాగునీరు, బిస్కెట్లు అందించేందుకు స్వచ్ఛంద సంస్థలు, దేవస్థానం సిబ్బంది ఏర్పాట్లు చేశారు.