ArticlesNews

ధర్మబద్ధంగా నిర్వహిస్తే జీవితం అర్థవంతం, ఆదర్శప్రాయం

262views

కుటుంబ ప్రభోధన్

మనిషి జీవితం ఎంతో ఉత్కృష్టమైంది. అమూల్యమైంది. దాని విలువ తెలిసిన మనిషి ప్రతి క్షణాన్నీ సద్వినియోగం చేసుకుంటాడు. తన జీవన గమనాన్ని నిరంతరం పరిశీలించుకుంటాడు. అవసరమైన మార్పులు చేసుకుంటాడు. జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలనే ఆశయం ప్రతి మనిషికీ ఉంటుంది. సహజమైన ఈ లక్ష్య సిద్ధి కోసం ప్రయాణించే మార్గం ఎల్లప్పుడూ ధర్మబద్ధంగా ఉండాలి. అది ఇతరులకు మేలు చేసేటట్లు కూడా ఉండాలి.

ఈ జీవిత ప్రయాణంలో ఎన్నో బంధాలు, పరిచయాలు ఏర్పడతాయి. మరెన్నో అనుభవాలు కలుగుతూంటాయి. మనతో కలిసి ప్రయాణించేవారు ఎందరో ఉంటారు. కానీ ఎవరూ శాశ్వతంగా మనతో ఉండరు. అయినా నిరాశపడకూడదు. ధర్మబద్ధమైన నడవడికతో ముందుకుసాగాలి. అదే మనల్ని రక్షిస్తుంది.

మంచి నడవడికతో ముందుకు సాగినా ఒక్కొక్కప్పుడు ఓటమిని కూడా అనుభవించక తప్పదు. విజయానికి పొంగిపోకుండా, పరాజయానికి కుంగిపోకుండా స్థితప్రజ్ఞతతో ముందుకు సాగిన మనిషి మాత్రమే తానాశించిన లక్ష్యాన్ని చేరుకోగలడు. నిజానికి ఈ ప్రపంచంలో ఏ ఒక్కరి జీవిత ప్రయాణమూ సాఫీగా సాగదు. ప్రయాణించే దారి ఎప్పుడూ పూలబాటగానే ఉండదు. ఆ దారిలో ముళ్లుంటాయి. రాళ్లుంటాయి. ఎన్నో ఎత్తుపల్లాలుంటాయి. అందరూ పడుతూంటారు. లేస్తూంటారు. ముందుకు సాగుతుంటారు. కిందపడినా మనోధైర్యంతో పైకి లేచేవాడే విజయం సాధించగలడని భర్తృహరి బోధిస్తాడు.

ఇక మనం ప్రయాణించే దారిలో మన ఉన్నతిని చూసి ఈర్ష్ష్యపడే కళ్లుంటాయి. తప్పుల్ని ఎత్తి చూపించే వేళ్లుంటాయి. వెక్కిరించే నోళ్లు కూడా ఉంటాయి. వీటన్నింటికీ భయపడితే ఎవరూ తాము కోరుకున్న గమ్యం చేరలేరు. కార్యసాధకులకు విఘ్నాలు అనేకం. వాటికి తలవంచి వెనకంజ వేయకుండా, ముందుకు సాగితేనే కలలు సాకారమవుతాయి.

జీవనగమనంలో కష్టనష్టాలను మౌనంగా భరించడం; ఓటమిని, అవమానాలను హుందాగా స్వీకరించడం వంటివి ధీర గంభీర వ్యక్తిత్వానికి నిదర్శనాలు. చక్రవర్తి కావాల్సిన శ్రీరాముడు తండ్రి మాటకి తలవంచి అరణ్యాలకు వెళ్లాడు. కారుణ్యమూర్తిగా, ఆదర్శపురుషుడిగా అందరి మన్ననలు పొందాడు. చివరికి రావణ సంహారం చేసి అవతార లక్ష్యాన్ని పూర్తిచేశాడు. పదమూడేళ్లు అరణ్యవాసం, సంవత్సరం అజ్ఞాతవాసం చేయాల్సివచ్చినా పాండవులు ధర్మాన్ని వీడక ముందుకు సాగారు. జీవితం అన్నాక కష్టసుఖాలు పడుగూ పేకల్లా అల్లుకుని ఉంటాయి. ఎంతటివారైనా వాటిని అనుభవించక తప్పదు.

ముళ్ల మధ్య ఉన్నా పువ్వులు ప్రసన్నంగా వికసిస్తూ, పరిమళాలు అందిస్తూ అందరికీ ఆనందాన్ని కలిగిస్తాయి. అదే రీతిగా మనిషి కూడా అడ్డంకులను అధిగమించి తన బాధ్యతలను సక్రమంగా, ధర్మబద్ధంగా నిర్వహిస్తే జీవితం అర్థవంతంగా, ఆదర్శప్రాయంగా సాగుతుంది. ఇతరులు తమను గుర్తించాలని ఆడంబరంగా బతకడం కన్నా సద్భావనలతో అందరికీ సహాయ, సహకారాలందించే వాళ్లే గొప్పవాళ్లు. ‘పరోపకారార్థం ఇదం శరీరం’ అన్న నీతివాక్యాన్ని అనుసరించి దయ, ప్రేమ, సహకార గుణాలతో పయనం సాగించాలి. అప్పుడే జీవితం ధన్యమవుతుంది.