
పల్నాడు అంటేనే ఠక్కున గుర్తుకొచ్చేది 12వ శతాబ్దం నాటి యుద్ధం.. బ్రహ్మనాయుడు, నాగమ్మల వీరోచిత పోరాటం.. పల్నాటి వీరుల తెగువ.. నేటికీ ఆ యుద్ధం గురించి కథలుగా చెబుతుంటారు.. ఆనాటి చరిత్రకు సజీవసాక్ష్యంగా ఎన్నో కట్టడాలు నేటికీ దర్శనమిస్తున్నాయి. ఆచారవంతులచే రక్షింపబడుతూ.. భావితరాలకు ఇక్కడి ఔన్నత్యాన్ని, త్యాగనిరతిని తెలియజేస్తున్నాయి. నాటి ఘటనల్ని మననం చేసుకుంటూ ఏటా వీరారాధనోత్సవాలు నిర్వహిస్తున్నారు. బుధవారం నుంచి ఉత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో ప్రత్యేక కథనం.
వీరుల ఆలయం
పల్నాటి యుద్ధవీరుల ఆలయం 15వ శతాబ్దంలో మొఘలుల పాలనలో నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఆ సమయంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు యుద్ధానికి వెళుతూ మార్గ మధ్యలో కారంపూడిలోని నాగులేరు వాగు పక్కన సేదతీరుతుండగా.. పల్నాటి యుద్ధంలో అమరవీరులకు ప్రతిరూపాలైన లింగాలకు అపచారం జరిగింది. దానికి పరిహారంగా ఆయన సైన్యంలోని జకీర్, ఫరీద్ అనే యుద్ధవీరులు ఆలయాన్ని నిర్మించి.. ఆయుధాలు, లింగాలు భద్రపరిచారు.
రాళ్లే ప్రతిరూపాలు
మాచర్ల, గురజాల రాజ్యాల కోసం కత్తులు దూసుకున్న వీరనాయకులు రణభూమికి తరలివస్తూ, వారి కుటుంబాలకు తమ ఆనవాళ్లుగా లింగాలను (గుండ్రంగా ఉండేరాళ్లు) ఇచ్చేవారు. ఆ లింగాలే వీరులకు ప్రతిరూపాలుగా, వారి ఆయుధాలే దైవాలుగా నేటికీ పూజిస్తున్నారు.
కన్నమదాసు మేడ
బ్రహ్మనాయుడి దత్తపుత్రుడు కన్నమదాసు హరిజనుడు కావడంతో ఆయనను యుద్ధంలోకి రానివ్వకూడదని షరతు పెట్టారు. దీంతో నాగులేటికి ఇవతల ఓ మేడ ఏర్పాటు చేసుకుని, దానిపై నుంచి కన్నమదాసు సైనికులకు సూచనలిచ్చారు. దానిని కన్నమదాసు మేడగా పిలుస్తున్నారు.
తోట బజారు: బ్రహ్మనాయుడు కారంపూడిలో చెన్నకేశవస్వామి ఆలయ నిర్మాణం జరిపిస్తున్న సమయంలో అంకాళమ్మ గుడి సమీపంలోని తోటలో మండపం ఏర్పాటు చేసుకుని ఉన్నారు. అందులో కూర్చొని ఆయన వైష్ణవానికి ప్రతీకలైన తిరునామాలను ధరించేవారు. ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని తోట బజారుగా పిలుస్తున్నారు.
కోట బురుజులు.. పల్నాటి రాజ్యంలోకి వచ్చేవారిని గమనించేందుకు 12వ శతాబ్దంలో కారంపూడి, మాచర్లలలో కోట బురుజులు నిర్మించారు. మాచర్లలోని బురుజు కాలగర్భంలో కలిసి పోగా.. కారంపూడిలో కొంతమేర కనిపిస్తోంది.
శంఖుతీర్థ మండపం.. వీరుల ఆలయ సమీపంలో శంఖుతీర్థ మండపం ఉంది. ఒకవేళ యుద్ధ క్షేత్రంలో మృత్యువాత పడితే.. వైకుంఠం చేరేలా వీర నాయకులు శంఖుతీర్థం తాగేవారు. యుద్ధానికి వెళ్తూ తీర్థం తీసుకునేవారు. ఈ మండపం ఇప్పటికీ దర్శించుకోవచ్చు.





