News

కుట్రపూరితంగా మరణశిక్ష : హసీనా

185views

బంగ్లాదేశ్‌ అల్లర్ల కేసులో ఢాకాలోని ఇంటర్నేషనల్‌ క్రైమ్స్‌ ట్రైబ్యునల్‌ తనకు మరణ శిక్ష విధించడాన్ని ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా ఖండించారు. ఈ తీర్పు మోసపూరితమైనదన్నారు. ప్రజాస్వామ్య విరుద్ధంగా ఏర్పడిన ప్రభుత్వం కుట్రపూరితంగా తనకు శిక్ష పడేలా చేసిందని ఆరోపించారు. తనను తాను నిరూపించుకోవడానికి కోర్టు న్యాయమైన అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయమూర్తులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారన్నారు.

మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించి ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని హసీనా అన్నారు. దేశంలో పేదరిక నిర్మూలన, విద్య, ఉద్యోగాలు, అభివృద్ధివంటి విషయాల్లో తన హయాంలో ఎన్నో చర్యలు తీసుకున్నామన్నారు. 2010లో బంగ్లాదేశ్‌ను అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో చేరేలా తమ ప్రభుత్వం నడిపించిందని గుర్తు చేశారు. మయన్మార్‌లో హింస చెలరేగడంతో బంగ్లాకు పారిపోయి వచ్చిన లక్షలాది మంది రోహింగ్యాలకు ఆశ్రయం కల్పించామన్నారు. మానవ హక్కుల పట్ల శ్రద్ధ లేకపోతే ఇవన్నీ ఎందుకు చేస్తామని ప్రశ్నించారు. మరోవైపు హసీనాకు వ్యతిరేకంగా తీర్పు వెలువడడంతో బంగ్లాలోని అవామీ లీగ్ పార్టీ మంగళవారం దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిస్తూ.. బంద్ ప్రకటించింది.

విద్యార్థుల ఆందోళనలతో అనూహ్యరీతిన ప్రధాని పీఠం నుంచి దిగిపోయిన షేక్‌ హసీనా గతేడాది ఆగస్టు 5న బంగ్లాదేశ్‌ను వీడి భారత్‌కు వచ్చారు. నాటినుంచి ఆమె దిల్లీలోని ఓ రహస్య ప్రదేశంలో నివసిస్తున్నారు. గతేడాది జరిగిన అల్లర్లు తీవ్ర హింసాత్మకంగా మారి అనేకమంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో హసీనాపై హత్య సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. వీటిపై విచారణ జరిపిన ఢాకాలోని ఇంటర్నేషనల్‌ క్రైమ్స్‌ ట్రైబ్యునల్‌ షేక్ హసీనా (Sheikh Hasina)ను దోషిగా తేల్చింది. ఆమెకు మరణ శిక్ష విధించింది. గతేడాది బంగ్లాలో అల్లర్లు జరిగిన సమయంలో తనకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న వారిపై హెలికాప్టర్లు, ప్రాణాంతక ఆయుధాలు ఉపయోగించి.. చంపేయాలని ఆమె ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపింది.