
చరకుడుని వైద్యశాస్త్ర పితగా చెప్పుకుంటాం. క్రీస్తుపూర్వం 1 లేదా 2వ శతాబ్దానికి చెందినవారని చరిత్రకారులు చెబుతారు. ఆయన రాసినదే ‘చరక సంహిత’, మనదేశానికి మరో ఎనిమిదేళ్లలో స్వరాజ్యం సిద్ధిస్తుందనగా 1939లో ఈ మహా సంస్కృత గ్రంథాన్ని నుదురుపాటి విశ్వనాథశాస్త్రి ‘చరక సంహిత-చికిత్సాస్థానము’ పేరుతో తెలుగులోకి అనువ దించారు. వావిళ్ల వారు ప్రచురించారు. 1480కి పైగా పేజీల ఈ పుస్తకంలో రచయిత ఉపోద్ఘాతంలో చరాచరాత్మక మైన సకలప్రపంచమునకు సృష్టికర్త, ఆది దేవుడు బ్రహ్మలో లీనమైన ఉన్న ఆయుర్వేదం చరకుడి వరకు చేరిన వైనాన్ని శ్లోకాలతో, శ్లోకాలకు చక్కని వ్యాఖ్యానంతో వివరించాడు. ఇందులో మొదటి అధ్యాయం అభయామలకముతో ఆరంభమైతే యోనివ్యాపచ్చికిత్సితమైన 30వ అధ్యాయంతో ఈ గ్రంథం సంపూర్ణమవుతుంది.
పుస్తకంలో మొదటి 13 అధ్యాయాలను చరకుడు రాసినవి. మిగిలిన 17 అధ్యాయాలు దృఢబలుడు రచించినవి. చరక సంహిత పురాతన భారతీయ వైద్య విధానం ఆయుర్వేదానికి పునాది అయిన గ్రంథాలలో ఒకటి. చరక మహర్షి చరక సంహిత రాశారు. ఈ గ్రంథం 120 అధ్యాయాలతో ఎనిమిది విభాగాలుగా విభజించారు. ఇది సమగ్ర ఆరోగ్యం, నివారణ సంరక్షణ, మూడు దోషాలైన వాత, పిత్త, కఫ సమతుల్యతను నొక్కి చెబుతుంది. సాక్షాత్తూ ఆదిశేషుడే చరకుడిగా అవతరించాడు. ఆత్రేయ ముని శిష్యుడు రచించిన తంత్రమును సంస్కరించాడు. చరక సంహితను రచించాడు.
పంచనదపుర వాస్తవ్యుడు కపిలబలుడి కుమారుడు దృఢబలుడు ఆయుర్వేద విద్యాకోవిదుడు.
“చికిత్సావహ్ని వేశస్య సుస్థాతురహితం ప్రతి,
యదిహాస్తి తదన్యత్ర యన్నే హాస్తి న తత్ క్వచిత్.”
ఈ చరకతంత్రము తక్కిన ఆయుర్వేద తంత్రముల కన్నింటికీ ఆదర్శమైనదని, ఆయుర్వేదానికి సంబంధించిన విషయాలన్నీ దీనిలోనే ఇమిడి ఉన్నాయని, పైన పేర్కొన్న శ్లోక రూపంలో దృఢబలుడు కొనియాడాడు
వీరిద్దరూ సంస్కృతంలో రాసిన దానికి తాను వ్యాఖ్యానం మాత్రమే చేశానని పుస్తకం ఉపోద్ఘాతంలో రచయిత వినమ్రంగా చెప్పుకోవడం ఆయుర్వేదం పట్ల, రచించిన మహర్షుల పట్ల వారికి ఉన్న భక్తిప్రపత్తులకు నిదర్శనం. రచయిత వాజీకరణ ఔషధం గురించి వ్యాఖ్యానించాడు. దశాబ్దాల క్రితమే సంతానం ప్రాముఖ్యతను వివరించాడు. ఆయుర్వేద వైద్యుడు రోగులనందరినీ సమదృష్టితో, తన బిడ్డల్లాగా చూసుకోవాలని, వారికి సంభవించిన బాధల నుంచి కాపాడాలని సూచించాడు. సంస్కృతంలో, శ్లోకరూపంలో ఉన్న ఔషధాలు, రసాయనాల తయారీలో వినియోగించాల్సిన పదార్థాలు, మూలికలను, తయారీ పద్ధతులను వ్యాఖ్యానరూపంలో అందించాడు.
ఒకానొక సందర్భంలో స్వచ్ఛమైన, దోషరహితమైన పెరుగుపైన ఉండే మీగడను శరత్కాల చంద్రుడితో పోల్చాడు. విశిష్టమైన ఆవు పాల సేవనంలో మూడు యోగాలను విడమరిచి చెప్పాడు. అందులో మొదటిది పచ్చి పాలను ఉపయోగించడం, రెండవది ఆ పాలనే కాచి ఉపయోగించడం, మూడవది పాలలో తేనెను, నేతిని కలిపి ఉపయోగించడం. వీటిని క్షీరయోగములు అని సూత్రీకరించాడు. జ్వరం వచ్చినప్పుడు లంకణం చేస్తే మంచిది అని చెబుతాడు. దానివల్ల జఠరాగ్ని రగులుకుంటుంది. జ్వరము తగ్గుతుంది. ఆకలి పుడుతుంది అని సూచిస్తాడు. ఔషధాలు, రసాయనాల తయారీలో వైడూర్యపు మణి, మంచి ముత్యాలు, నల్లని ఇసుక, బంగారం వినియోగాన్ని ప్రస్తావిస్తాడు. ఆఖరిదైన 30వ అధ్యాయం చివర్లో కన్నులు లేని చిత్రకారుడు చిత్రపటమును ఎలాగైతే రచించలేడో అదే తీరుగా ఈ శాస్త్రమును, దీనిలోని వాస్తవిక అర్థాన్ని చక్కగా అవగతం చేసుకోలేని వైద్యుడు చికిత్స చేయడానికి అర్హుడు కాడు అని స్పష్టం చేశాడు.





