News

మసీదు నిర్మాణం ప్లాన్‌ను తోసిపుచ్చిన అయోధ్య డవలప్‌మెంట్ అథారిటీ

237views

ఉత్తరప్రదేశ్‌లోని ధన్నిపూర్ గ్రామంలో మసీదు నిర్మాణం కోసం సమర్పించిన ప్లాన్‌ను అయోధ్య డవలప్‌మెంట్ అథారిటీ-ADA తోసిపుచ్చింది. పలు ప్రభుత్వ శాఖల నుంచి నో-అబ్జెక్షన్ సర్టిఫికెట్లు సమర్పించకపోవడంతో ఏడీఏ ఈ నిర్ణయం తీసుకుంది. 2019లో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పునకు అనుగుణంగా మసీదు నిర్మాణానికి కేటాయించిన భూమిని సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డుకు యూపీ ప్రభుత్వం అప్పగించింది.

రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ (RTI) కింద పాత్రికేయుడు ఓం ప్రకాష్ సింగ్ అడిగిన ప్రశ్నకు ఏడీఏ సెప్టెంబర్ 16న సమాధానం ఇచ్చింది. మసీదు ట్రస్టు 2021 జూన్ 23న అప్లికేషన్ పెట్టుకుందని, అయితే వివిధ శాఖల నుంచి క్లియెరెన్స్ లేకపోవడంతో దానిని తిరస్కరించామని తెలిపింది. ప్రజాపనుల శాఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, సివిల్ ఏవియేషన్, ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ కార్పొరేషన్, ఫైర్ సర్వీసు నుంచి అనుమతులు పొందలేదని తెలిపింది.

సుప్రీంకోర్టు 2019 నవంబర్ 9న చారిత్రక తీర్పు ఇచ్చింది. అయోధ్యలోని వివాదాస్పద స్థలాన్ని రామాలయ నిర్మాణం కోసం హిందువులకు అప్పగించాలని, మసీదు నిర్మాణం, ఇతర సౌకర్యాల కోసం 5 ఎకరాల స్థలాన్ని సున్నీ బోర్టుకు కేటాయించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. దీంతో అయోధ్యకు 25 కిలోమీటర్ల దూరంలోని ధాన్నిపూర్ గ్రామం సోహవల్ తహసిల్‌లో ఐదు ఎకరాల స్థలాన్ని సున్నీ సెంట్రల్ వక్ఫ్‌బోర్డుకు అప్పటి జిల్లా మెజిస్ట్రేట్ అంజు కుమార్ ఝా అందజేశారు. అప్లికేషన్, సెక్యూరిటీ ఫీజు కింద మసీదు కమిటీ రూ.4,02,628 చెల్లించిందని, అయితే డిపార్ట్‌మెంటల్ ఆమోదం లేకపోవడంతో ప్రాజెక్టు ఆగిపోయిందని ఆర్డీఐ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఏడీఏ తెలిపింది.