
( సెప్టెంబర్ 24 – తిరుమల శ్రీవేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు ప్రారంభం )
ఆలయంలో మూల మూర్తిగా కొలువైన భగవంతుడు పర్వదినాల్లో ఉత్సవమూర్తిగా దర్శనమిస్తూ భక్తులను అనుగ్రహిస్తాడు. తిరుమలేశుని బ్రహ్మోత్సవాల్లో వాహనసేవలు నయనానందకరమే కాదు కైవల్యదాయకం కూడా!
ఏడుకొండలపై వెలసిన శ్రీవేంకటేశ్వరుడు ఉత్సవాల దేవుడు. ఆయన కొలువైన ఆనందనిలయం నిత్యకల్యాణం పచ్చతోరణం. అంతటి భువనైక మోహనుడి బ్రహ్మోత్సవాలను తిలకించడం మన పుణ్యఫలం. తిరుమల పురవీధుల్లో ఆ శ్రీనివాసుడికి జరిగే శోభాయమాన సేవల్లో పాల్గొన్నవారి మనసులు పులకించిపోతాయి. జన్మలు పునీతమవుతాయి. మూలవిరాట్టుగా ఆలయంలో నిత్యపూజలందుకునే ఆ స్వామి ఉత్సవాలవేళ భక్తజనుల నడుమ ఊరేగుతాడు. ఆ వేడుకల సంరంభంలో సకల దేవతలూ సప్తగిరులకు విచ్చేసి, వేంకటేశ్వరుని వైభవాన్ని వీక్షిస్తారన్నది పురాణోక్తి. వరాహ, భవిష్యోత్తర, బ్రహ్మండ, మార్కండేయ, వామన తదితర పురాణాల్లో శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాల ప్రస్తావన కనిపిస్తుంది. శతాబ్దాల క్రితం ఈ బ్రహ్మోత్సవాలు పన్నెండు రోజులు జరిగేవని శాసనాల్లో లిఖితమైంది.
ఆపద్బాంధవుడికి అనేక ఉత్సవాలు..
తిరుమలలో శ్రీనివాసుడికి సామాన్య ఉత్సవాలు, సంవత్సరోత్సవాలు అని రెండు ప్రధాన వేడుకలు నిర్వహిస్తారు. వాటిలో ప్రత్యేకమైనవి బ్రహ్మోత్సవాలు. విజయనగర రాజుల కాలంలో తిరుమలలో అన్ని ఉత్సవాలూ ఘనంగా జరిగేవి. అయితే విజయనగర సామ్రాజ్య పతనానంతరం కర్ణాటక నవాబులు, ఆపై ఆంగ్లేయులు తిరుమల ఆలయాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. ఖర్చులు అధికమని భావించి అనేక ఉత్సవాలు, నైవేద్యాలు నిలిపేశారు. కానీ ఆశ్వయుజమాసంలో వచ్చే బ్రహ్మోత్సవం, మూడేళ్లకు ఒకసారి వచ్చే నవరాత్రి బ్రహ్మోత్సవం యథాతథంగా నిర్వహించారు. నేటికీ ఆ ఉత్సవాలు అలాగే కొనసాగుతున్నాయి. ‘కన్యామాసంలో(ఆశ్వయుజ) శ్రీవేంకటాచల మహోత్సవాన్ని కనులారా వీక్షించేవారికి ధనం, ధాన్యం, భూములూ, పుత్రపౌత్రుల్ని అనుగ్రహిస్తాను’ అని వేంకటేశుడు వరం ప్రసాదించాడన్నది పురాణవాక్కు.
బ్రహ్మదేవుడే శ్రీకారం చుట్టి..
చతుర్ముఖ బ్రహ్మ స్వయంగా శ్రీనివానుడి ఉత్సవాలకు శ్రీకారం చుట్టాడని శాస్త్రాలు చెబుతున్నాయి. తొలుత బ్రహ్మదేవుడు నాలుగు వేదాలకు ప్రతీకగా తిరుమలలో ఉత్సవ శ్రీనివాసమూర్తి, ఉగ్ర శ్రీనివాసమూర్తి, సర్వాధిప శ్రీనివాసమూర్తి, లేఖక శ్రీనివాసమూర్తి- అనే నాలుగు విధాలైన వేంకటేశ్వరుడి అర్చామూర్తులను ఆనందనిలయంలో ప్రతిష్టించాడు. ఆ నాలుగింటికి మూలవిరాట్టుగా ఆనందనిలయంలో సాక్షాత్తూ వేంకటాచలపతిగా శ్రీమహావిష్ణువు ఆరాధనలు అందుకుంటున్నాడు. ఆనందనిలయుడైన శ్రీనివాసుడిని ప్రధాన దేవతగా చేసుకొని ఉత్సవమూర్తులకు బ్రహ్మదేవుడు వేడుకలను నిర్వహించాడు. వాహనసేవలతో సహా తొమ్మిదిరోజులు సాగే ఆ ఉత్సవాలు నేటికీ కొనసాగుతున్నాయి.
ధ్వజారోహణంతో ఆరంభ
శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ఆరంభమవుతాయి. భవిష్యోత్తర పురాణం వివరించిన ప్రకారమే నేటికీ వాహనసేవలు కొనసాగుతున్నాయి. పది రోజుల ఈ మహోత్సవాల్లో తొలిరోజు అంకురార్పణ చేస్తారు. ఆ సాయంకాలం శ్రీనివాసుడి సేనాధిపతి అయిన విష్వక్సేనుణ్ణి వేదమంత్రాలతో ఆహ్వానించి.. ఆయన ఆధ్వర్యంలోనే ఉత్సవాలు జరుగుతున్నట్లు భావిస్తూ ఆ వేడుకల్ని దర్శించమని దేవతల్ని ఆహ్వానిస్తారు. ఆ రోజే భూమాతను పూజించి పుట్టమన్ను సేకరించటం సంప్రదాయం. దీనిని ‘మృత్ సంగ్రహణం’ అంటారు. మరునాడు సాయంత్రం ధ్వజారోహణోత్సవం జరుగుతుంది.
విశేషమైన వాహనసేవలు
బ్రహ్మోత్సవాల్లో శ్రీవేంకటేశ్వరుడు తొలిరోజు పెద్దశేష వాహనాన్ని అధిరోహిస్తాడు. ఏడుకొండలకు ప్రతీకగా ఏడుపడగల ఆదిశేషుడే ఈ విధంగా స్వామిని మోసే భాగ్యం పొందాడు. రెండోరోజు శ్రీనిలయుడు చిన్నశేష వాహనంపై ఆసీనుడై తిరుమలలో విహరిస్తాడు. ఆపై వరుసగా హంస, సింహ, కల్పవృక్ష, సర్వభూపాల, గరుడ, హనుమత్, గజ, సూర్యప్రభ, చంద్రప్రభ, అశ్వ వాహనాలపై వేంకటాచలపతి ఊరేగి భక్తులను అనుగ్రహిస్తాడు.
మనోహర ముత్యాలపందిరిలో..
తిరుమలలో మౌక్తిక వాహనసేవ మనోహరం. ఈ వాహనాన్నే ముత్యాల పందిరి అన్నాడు అన్నమయ్య. సత్వ గుణానికి సంకేతం ముత్యం. సత్వగుణం కలిగినవారిలోనే భగవంతుడు ఉంటాడు- అనటానికి ఈ వాహనసేవ సంకేతం. ముత్యం లాంటి స్వచ్ఛమైన మనసుతో స్వామిని సేవిస్తే జీవులు ముక్తజీవులు అవుతారని ఈ సేవ సూచిస్తుంది.
వాహనసేవల దర్శనంతో ఫలాలు..
తిరుమలలో శ్రీవేంకటేశ్వరుడికి జరిగే వాహనసేవల్ని తిలకిస్తే ఎన్నో ఫలితాలు దక్కుతాయని మహర్షులు పేర్కొన్నారు. శేషవాహనంతో మోక్షప్రాప్తి, హంసవాహనంతో జ్ఞానం, సింహవాహనంతో కీర్తిప్రతిష్టలు, ముత్యాలపందిరి వాహనంతో శాంతిసౌభాగ్యాలు, కల్పవృక్ష వాహనంతో ఇహపరలోక సుఖాలు, సర్వభూపాలవాహనంతో అధికార ప్రాప్తి లభిస్తాయని పేర్కొన్నారు. శ్రీనివాసుడి మోహినీ అవతార దర్శనంతో మనలోని అజ్ఞానం నశిస్తుందని, గరుడవాహనసేవను తిలకిస్తే ఆధ్యాత్మికోన్నతి కలుగుతుందని వివరించారు.
ఆరోగ్యప్రాప్తి.. మనోధైర్యం..
తిరుమల ఉత్సవాల్లో సూర్యప్రభవాహనాన్ని వీక్షిస్తే ఆరోగ్యం, చంద్రప్రభవాహనాన్ని దర్శిస్తే ధైర్యం, అశ్వ వాహన దర్శనంతో మనోనిగ్రహం ప్రాప్తిస్తాయంటారు. హనుమత్, గజవాహనాలను వీక్షిస్తే సాక్షాత్తూ ఆ స్వామి వైకుంఠ దర్శనం చేయిస్తాడని, రథోత్సవాన్ని, చక్రస్నానాన్ని తిలకించినవారి పాపాలను ప్రక్షాళన చేసి, జ్ఞానాన్ని అందిస్తాడని చెబుతారు.
నిత్యజీవితంలో ఎదురయ్యే కష్టనష్టాల నుంచి మనల్ని విముక్తులను చేసేందుకు ఈ ఉత్సవాలు తోడ్పడతాయి. వేడుకల రూపంలో తనను సమీపించేవారిని స్వామి అనుగ్రహించి ఆధ్యాత్మిక ఉన్నతిని ప్రసాదిస్తాడు. ఉత్సవాల సందర్భంగా భగవంతుడి సేవలో, భక్తుల సేవలో పాల్గొనేవారి లౌకిక, పారలౌకిక అభీష్టాలను స్వామి త్వరితంగా తీరుస్తాడని పురాణేతిహాసాలు తెలియజేస్తున్నాయి.





