ArticlesNews

విశ్వామిత్రుడు

245views

‘వశిష్ఠ వాక్యం’ అని మన తెలుగులో ఒక జాతీయం ఉంది. తిరుగులేని నిర్ణయం అనే అర్థంలో దాన్ని వాడుతుంటారు. వశిష్ఠుడు అనగానే మనకు విశ్వామిత్రుడూ గుర్తొస్తాడు. వశిష్ఠుడు స్వతహాగా మహర్షి అయితే విశ్వామిత్రుడు గాధేయుడిగా క్షత్రియ వంశంలో జన్మించి పట్టుదల, తపోబలంతో బ్రహ్మర్షి అయ్యాడు. వశిష్ఠ, విశ్వామిత్రుల కలయిక రామాయణం బాలకాండలో జరుగుతుంది.

వశిష్ఠమహర్షి ఆశ్రమానికి వచ్చిన విశ్వామిత్రుడు ఆయన దగ్గర ఉన్న నందిని అనే కామధేనువును చూసి తనకు ఇవ్వమని కోరతాడు. ఆధ్యాత్మిక కార్యాలకు, యజ్ఞాలకు మాత్రమే తాను దాన్ని ఉపయోగించుకుంటున్నానని చెప్పి ఇవ్వడానికి నిరాకరిస్తాడు వశిష్ఠుడు. దాంతో అశేష సైన్యంతో వచ్చి కామధేనువును బలవంతంగా తీసుకుపోవాలని ప్రయత్నిస్తాడు విశ్వామిత్రుడు. కానీ వశిష్ఠుడి తపోబలం ముందు విశ్వామిత్రుడి యావత్తు సైన్యం నిలబడలేదు. దాంతో తపశ్శక్తి గొప్పదనాన్ని తెలుసుకున్న విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావాలనుకుంటాడు. తపోబలాన్ని పొందినప్పటికీ కోపాన్ని, గర్వాన్ని వదలక త్రిశంకుడి విషయంలో భంగపాటుకు గురవుతాడు. త్రిశంకుడి అసలు పేరు సత్యవ్రతుడు.

శరీరంతో స్వర్గానికి పోవాలన్న కోరికతో మొదట వశిష్ఠుణ్ని అడుగుతాడు. ఆయన సాధ్యం కాదనడంతో ఆయన కుమారుల దగ్గరికి వెళ్లి యజ్ఞం చేసి తనను స్వర్గానికి పంపమని అర్థిస్తాడు. వాళ్లు కూడా తిరస్కరించడంతో దుర్భాషలాడి ప్రతిగా వాళ్ల శాపం పొంది విశ్వామిత్రుణ్ని ఆశ్రయిస్తాడు. వశిష్ఠుడి మీద కోపంతో ఆయన కన్నా తాను గొప్ప అని నిరూపించుకునేందుకు యజ్ఞం చేసి ఆ ఫలంతో త్రిశంకుణ్ని స్వర్గానికి పంపుతాడు. అతణ్ని దేవేంద్రుడు అడ్డుకుంటాడు. దాంతో తలకిందులుగా కింద పడుతున్న త్రిశంకుణ్ని తన తపోబలంతో పడకుండా ఆపి అక్కడే అతడికి ఒక స్వర్గాన్ని సృష్టిస్తాడు విశ్వామిత్రుడు. అటూ ఇటూ కాకుండా పోయిన వ్యక్తులను, పనులను త్రిశంకు స్వర్గంతో పోలుస్తుంటారు అందుకే.

విశ్వామిత్రుడు పట్టువదలక మళ్లీ తపస్సుకు కూర్చోవడంతో ఇంద్రుడు మేనకను పంపి తపోభంగం చేయిస్తాడు. వారి కలయిక వల్ల శకుంతల జన్మిస్తుంది. శకుంతల దుష్యంతుల కుమారుడే భరతుడు. భరతుడి పేరుతోనే భారతదేశం అన్న పేరు వచ్చిందంటారు. విశ్వామిత్రుడు కోపిష్టి, గర్విష్టి అయినప్పటికి హరిశ్చంద్రుడి సత్యసంధతను లోకానికి చాటేందుకు, శ్రీరాముడు రాక్షసులను సంహరించేందుకు కారణమయ్యాడు. యజ్ఞంలో బలికోసం అంబరీషురాజు శునశ్చేపుణ్ని కొనుగోలు చేసినప్పుడు అతణ్ని రక్షించడానికి తన కుమారులను పంపేందుకు సిద్ధమయ్యాడు. ఇలాంటి సద్గుణాలు ఎన్ని ఉన్నప్పటికి కోపం, గర్వం కారణంగా భంగపడ్డాడు. మనిషి ఎంత గొప్పవాడైనా అహంకారం, ఆగ్రహం వంటి వాటికి లోబడితే ఎన్ని ఇబ్బందులు పడతాడో చెప్పడానికి, అలాగే పట్టుదలతో ఏదైనా సాధించవచ్చనడానికి విశ్వామిత్రుడి గాథే నిదర్శనం.