News

శబరిమల విగ్రహాలపై 4.5 కిలోల బంగారం ఏమైంది..? దర్యాప్తునకు కోర్టు ఆదేశం

334views

కేరళలోని ప్రసిద్ధ శబరిమల ఆలయంలో విగ్రహాల బంగారు పూతపూసిన తాపడాలను అనుమతి లేకుండా తొలగించడం ఇటీవల వివాదాస్పదమైంది. తాజాగా ఇందుకు సంబంధించిన మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విగ్రహాల ( తాపడాలపై బంగారం బరువు తగ్గడాన్ని కేరళ హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. దీనిపై విజిలెన్స్‌ కమిటీ దర్యాప్తు చేపట్టాలని న్యాయస్థానం ఆదేశించింది. అసలేం జరిగిందంటే..

శబరిమలలో గర్భగుడి ముందు ఉన్న ద్వారపాలక విగ్రహాలపై బంగారు పూతపూసిన రాగి తాపడాలను 2019లో మరమ్మతుల నిమిత్తం తొలగించారు. వాటిని సరి చేయించి కొత్త బంగారు పూత తాపడాలను అందిస్తానని ఉన్నికృష్ణన్‌ అనే దాత తీసుకెళ్లారు. ఈ పనిని చెన్నైలోని ఓ సంస్థకు అప్పగించారు.

2019లో వాటిని తొలగించే సమయంలో తాపడాల బరువు 42.8 కిలోలుగా ఉన్నట్లు రికార్డుల్లో ఉంది. అయితే, ఆ తాపడాలను తమ వద్దకు తెచ్చినప్పుడు బరువు 38.28 కిలోలు మాత్రమే ఉందని సదరు కంపెనీ తెలిపింది. అంతేగాక, ఆలయం నుంచి తాపడాలను తొలగించిన దాదాపు 40 రోజుల తర్వాత వాటిని చెన్నైలోని కంపెనీకి అందించినట్లు తెలిసింది.

ఈ పరిణామాలపై తాజాగా కోర్టు అనుమానం వ్యక్తం చేసింది. ఉన్నట్టుండి తాపడాల బరువు 4.524 కేజీలు తగ్గడాన్ని తీవ్రంగా పరిగణించింది. వీటిని తిరిగి అమర్చినప్పుడు ఎందుకు బరువును సరిచూడలేదని ప్రశ్నించింది. ఈ తగ్గుదలకు ఏకైక కారణంగా బంగారు పూత తగ్గడమే అని న్యాయస్థానం అభిప్రాయపడింది. లేదంటే దాత వాటి స్థానంలో మరో తాపడాల సెట్‌ను కంపెనీకి ఇచ్చే అవకాశం కూడా ఉన్నట్లు పేర్కొంది. ఇందులో అనేక లోపాలు కనిపిస్తున్నాయని, బరువు ఎలా తగ్గిందో తెలుసుకునేందుకు విజిలెన్స్‌ కమిటీ దర్యాప్తునకు ఆదేశించింది. ఇందుకు సహకరించాలని ట్రావెన్‌కోర్‌ దేవస్వం బోర్డుకు సూచించింది. దీనిపై మూడు వారాల్లోగా పూర్తి నివేదికను అందజేయాలని స్పష్టం చేసింది. అనంతరం ఈ కేసు విచారణను సెప్టెంబరు 30వ తేదీకి వాయిదా వేసింది.

శబరిమల స్పెషల్‌ కమిషనర్‌కు సమాచారం ఇవ్వకుండానే ద్వారపాలక విగ్రహల బంగారు తాపడాలను మరమ్మతుల నిమిత్తం తొలగించడంపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఇటీవల దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముందస్తు అనుమతులు లేకుండా వాటిని ఎలా తరలిస్తారని ప్రశ్నించింది. దీనిపై బోర్డు నుంచి వివరణ కోరింది.