
భారత పార్లమెంట్‌పై జరిగిన ఆత్మాహుతి దాడి, 26/11 ముంబయి మారణకాండ వెనుక జైషే అధినేత మసూద్ అజర్ హస్తం ఉందని ఆ సంస్థ టాప్ కమాండర్ అంగీకరించాడు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇటీవల ఆ సంస్థకు చెందిన మసూద్ ఇలియాస్ కశ్మీరి ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ ‘‘అమిర్ ఉల్ ముజాహిద్దీన్ మౌలానా మసూద్ అజర్ భారత్ జైలు నుంచి బయటపడి పాకిస్థాన్ వచ్చాక బాలాకోట్‌లో ఆయనకు ఆశ్రయం లభించింది. ’’ అని పేర్కొన్నాడు. పాకిస్థాన్లో ఉగ్రవాదులు ఆశ్రయం పొంది భారత్ పై దాడులు చేస్తున్నారనటానికి ఈ ప్రకటన బలమైన ఆధారంగా నిలిచింది.
ఇలియాస్ కశ్మీరీ చెప్పినదాని ప్రకారం మసూద్ అజార్ బాలాకోట్‌ను అడ్డాగా చేసుకొని ఎప్పటి నుంచో భారత్‌పై ఉగ్ర కుట్రలు పన్నుతున్నట్లు తేలింది. ఇక ఒసామా బిన్ లాడెన్‌ను ఇలియాస్ అమరవీరుడిగా పోల్చాడు. పాక్ సైన్యం పహారాలో జైషే స్థావరం స్వేచ్ఛగా నడుస్తోందని భారత్ ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది. పాక్ మాత్రం అక్కడ ఎటువంటి ఉగ్ర క్యాంపులు లేవని ప్రపంచానికి నమ్మబలుకుతోంది.
ఇప్పటికే ‘ఆపరేషన్ సిందూర్’తో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు మౌలానా మసూద్ అజార్ కుటుంబీకులు ముక్కలు ముక్కలైపోయారని ఇలియాస్ చేసిన ప్రకటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ‘‘ మేం దిల్లీతో పోరాడాం. కాబూల్‌తో పోరాడాం. కాందహార్‌తో పోరాడాం. అన్నింటినీ త్యాగం చేశాం. మే 7న బహావల్‌పుర్‌పై భారత్ జరిపిన దాడిలో మసూద్ అజార్ కుటుంబ సభ్యులు, వారి పిల్లలు ముక్కలైపోయారు’’ అని ఇలియాస్ వ్యాఖ్యానించాడు.





