
సంభాల్ యంత్రాంగం అక్రమ, చట్టవిరుద్ధ ఆక్రమణలపై ఉక్కు పాదం మోపింది. మసీదు, మదర్సా, చివరికి ఊరి చెరువులను కూడా కబ్జా చేసిన వారిపై కేసులను నమోదు చేయడం ప్రారంభించింది. మదర్సాలు, మసీదులను సంరక్షించే వారు ఈ ఆక్రమణలను మరింత సులభతరం చేశారన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఆక్రమించిన స్థలాలను ఖాళీ చేయాలని ప్రభుత్వం గడువు ఇచ్చినా… ససేమిరా అంగీకరించలేదు. దీంతో ప్రభుత్వం ఆ అక్రమ నిర్మాణాలను కూల్చేయడంతో పాటు కేసులు నమోదు చేయడం కూడా ప్రారంభమైంది.
యూపీ రెవిన్యూ కోడ్ సెక్షన్ 67 కింద దర్యాప్తు ప్రారంభం చేయడంతో ఈ విషయాలన్నీ బట్టబయలయ్యాయి. అలాగే స్థానికుల నుంచి కూడా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో స్థానిక ప్రభుత్వ అధికారులు అక్కడి అక్రమ నిర్మాణాలను సందర్శించారు.సాలెంపూర్ సలార్‌లో జరిపిన దర్యాప్తులో 0.154 హెక్టార్ల ప్రభుత్వ భూమిలో ఒక మదర్సా అక్రమంగా నిర్మించబడిందని, ఒక మసీదు 439 చదరపు మీటర్ల గ్రామ సొసైటీ భూమిని ఆక్రమించిందని తేలింది.
ముఖ్యంగా రాయ్ బుజుర్గ్ అనే ప్రాంతంలో ఆక్రమణలను విపరీతంగా పెరిగినట్లు తేలింది. గ్రామ చెరువుకు సంబంధించిన భూమిలోనే ఓ ఫంక్షన్ హాలును కట్టేశారు. అలాగే ఒకటిన్నర ఎకరాల భూమిలో మసీదు కూడా నిర్మించేశారు. ముఖ్యంగా ముతవల్లే (మసీదు, మదర్సా సంరక్షులు) చెరువు భూమిని ఆక్రమించాడు. ప్రభుత్వ భూమిని కూడా తన సొంత ఆస్తిగా మార్చాడని దర్యాప్తులో తేలింది.
అక్రమంగా నిర్మించిన వాటిని అధికారులు గుర్తించిన తర్వాత అధికారులు వాటికి ఎర్ర రంగులతో గుర్తులు వేశారు. ఆక్రమణదారులు సెప్టెంబర్ 20 లోపు అక్రమ నిర్మాణాలను తొలగించాలని, లేకుంటే రెవెన్యూ శాఖ ప్రత్యక్ష చర్యలు తీసుకుని నిర్మాణాలను కూల్చివేస్తుందని తహసీల్దార్ హెచ్చరించారు. అయినా వినకపోవడంతో చివరికి కూల్చేసి, కేసులు పెట్టారు.





