News

ఎమర్జెన్సీ సంజయ్‌ గాంధీ బలవంతపు కు.ని. ఆపరేషన్లు : శశిథరూర్‌

269views

భారత చరిత్రలో ఎమర్జెన్సీ రోజులను కేవలం చీకటి అధ్యాయంగా మాత్రమే గుర్తుంచుకోకూడదని కాంగ్రెస్‌ (Congress) సీనియర్‌ ఎంపీ శశిథరూర్‌ (Shashi Tharoor) అన్నారు. దాన్నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయన్నారు. దేశంలో అత్యవసర పరిస్థితి విధించి ఇటీవల 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఓ మలయాళ డైలీకి థరూర్‌ వ్యాసం రాశారు. అందులో ఎమర్జెన్సీ సమయంలో సంజయ్‌ గాంధీ వ్యవహరించిన తీరును ఎండగట్టారు. నాడు ఆయన బలవంతంగా జరిపించిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను ఎవరూ మర్చిపోలేరన్నారు.

‘‘1975 జూన్‌ 25 నుంచి 1977 మార్చి 21 వరకు దాదాపు రెండేళ్ల పాటు దేశంలో ఎమర్జెన్సీ విధించారు. నాడు క్రమశిక్షణ కోసం చేపట్టిన ఆ చర్యలు.. మాటల్లో చెప్పలేని క్రూరత్వానికి దారితీశాయి. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కుమారుడు సంజయ్‌ గాంధీ గ్రామీణ ప్రాంతాల్లో వాసెక్టమీ క్యాంపెయిన్లు నిర్వహించి బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిపించారు. ఏకపక్షంగా ఏర్పరుచుకున్న లక్ష్యాలను చేరుకోవడం కోసం హింసను ఎంచుకున్నారు. ఆ సమయంలో అదుపులేని శక్తి నిరంకుశత్వానికి దారితీసింది. ఆ తర్వాత ఈ చర్యలను ‘దురదృష్టకరంగా’ అభివర్ణించినప్పటికీ.. ఆ రోజులను ఎవరూ మర్చిపోలేరు’’ అని థరూర్‌ రాసుకొచ్చారు.

‘‘ఎమర్జెన్సీ కాలం ఇప్పుడున్న ఇండియాలా లేదు. ప్రస్తుతం మనం స్వావలంబనతో ముందుకుసాగుతున్నాం. బలమైన ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటుచేసుకుంటున్నాం. కానీ, ఆ సమయంలో దిల్లీ లాంటి ప్రాంతాల్లో మురికివాడలను నిర్దయగా నాశనం చేశారు. వేలాదిమందిని నిరాశ్రయులుగా మిగిల్చారు. వారి సంక్షేమం గురించి పట్టించుకోలేదు. ప్రాథమిక హక్కులను అణగదొక్కి.. భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకున్నారు. ఇవన్నీ భారత రాజకీయాల్లో మాయని మచ్చగా మిగిలాయి. ఆ రోజులను కేవలం చీకటి అధ్యాయంగానే గుర్తుంచుకోకూడదు. వాటి నుంచి పాఠాలు నేర్చుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి’’ అని థరూర్‌ అభిప్రాయం వ్యక్తంచేశారు.