
నేడు ప్రపంచ జనాభా దినోత్సవం. జనసంఖ్యలో హెచ్చుతగ్గులు దేశ స్థితిగతులను ప్రభావితం చేస్తాయి. అందుకే పదేళ్లకోసారి జనగణన ఆధునిక పాలనకు అవసరం. ప్రజల జీవన, ఆయుప్రమాణాల గురించి తెలుసుకుని తదనుగుణంగా సంక్షేమ పథకాల అమలుకు కృషిచేస్తాయి ప్రభుత్వాలు.
రామాయణ కాలంలోనూ జీవన ప్రమాణాలు, ధర్మానుసార జీవితం పట్ల దృష్టిని కేంద్రీకరించారు. వాల్మీకి అయోధ్య గురించి చెబుతూ- ప్రజలు, రాజు కూడా తమ ధర్మంపట్ల నిష్ఠగా ఉండేవారని రాశారు. భారతంలోని శాంతిపర్వంలో భీష్ముడు యుధిష్ఠిరుడికి పాలనలో ప్రజా సంక్షేమానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యం గురించి వివరించాడు.
కురుక్షేత్ర సంగ్రామం తర్వాత దేశం జనశూన్యమైపోయినట్టు వర్ణిస్తూనే ధర్మహీనమైన రాజనీతి వల్ల జనాభా నాశనమవ్వచ్చు అనే హెచ్చరిక కూడా చేస్తుంది భారతం. నైతికజీవన విధానంతోనే సమాజ సమతుల్యత సాధ్యం. కౌరవుల మాదిరిగా దుష్టబుద్ధి గల వంద మంది కొడుకుల కన్నా ధర్మనిరతి గల పంచపాండవులు మేలు. అధిక జనాభా కన్నా ధర్మబద్ధ జీవితం, సామాజిక సమతుల్యత ముఖ్యమని ప్రాచీన గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. జనాభా నియంత్రణ తత్వం పరోక్షంగా ఉన్నా- నైతికత, సామరస్యం, సామాజిక క్రమం విషయంలో వాటిలో గాఢమైన సందేశాలున్నాయి. అక్షరాస్యులు, లక్ష్యసాధకులు, న్యాయవర్తనులైన ప్రజలు ఉంటే సరిపోదు. వారంతా అందరికీ అవసరమైన వనరులను ఉత్పత్తి చేయగలగాలి. అలాంటి ప్రజలు దేశానికి సంపదతో సమానం. ‘వనరుల కన్నా వేగంగా జనాభా పెరిగితే అది ప్రళయానికి దారి తీస్తుంద’ని ఆర్థికవేత్తలు సైతం హెచ్చరిస్తున్నారు. వనరులను ఉత్పత్తిచేసే భూమి దైవంతో సమానమని రుగ్వేదం చెబుతోంది.
ఒకప్పుడు దేవగిరి అనే ఊళ్లో ప్రజలు స్వయంకృషితో సమృద్ధిగా వనరులను నిల్వ చేసుకునేవారు. ప్రతి ఇంటా దైవనామస్మరణ నిత్యకృత్యం. పెద్దల పట్ల గౌరవం వెల్లివిరిసేది. ధర్మానికే పెద్ద పీట వేసేవారు. కానీ, ఒకరోజు గ్రామంలోకి వచ్చిన ఓ పండితుడు, ‘ఇదంతా మీ సొంత పుణ్యం కోసం మాత్రమేనా, నిజమైన ధర్మం పరుల సేవలో లేదా?’ అని ప్రశ్నించాడు. దాంతో గ్రామస్థులు ఆలోచనలో పడ్డారు. అప్పటి నుంచి వారు తమ భక్తిని కేవలం పూజలకే పరిమితం చేయకుండా అవసరంలో ఉన్న పొరుగు గ్రామాలవారికి సాయం చేయడమూ మొదలెట్టారు. అప్పుడే వారికి నిజమైన ఆనందం, శాంతి లభించాయి. పరోపకారంలోని పరమార్థాన్ని ఆ గ్రామస్థులు అర్థం చేసుకున్నారు.
‘దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్!’ అన్నారు గురజాడ. దేశాభివృద్ధి అంటే కేవలం సువిశాల భూభాగం, రోడ్లు, భవనాలు, కర్మాగారాలే కాదు. అక్కడి జనాభా, వారి చైతన్యం, నైతికత, బాధ్యత, విద్య ఇవన్నీ కలిస్తేనే అభివృద్ధి. మానవ వనరులు గొప్పవే… వారు చైతన్యవంతులై, జ్ఞానవంతులై, నైతిక విలువలను పాటిస్తూ దేశాభివృద్ధికి సహకరిస్తే ప్రగతి మరింత గొప్పగా ఉంటుంది.





