News

కనకదుర్గ అమ్మవారి భూములకు రక్షణ ఏది

209views

విజయవాడ లోటస్‌ల్యాండ్‌ ప్రాంతంలో కనకదుర్గ అమ్మవారి భూముల రక్షణను అధికారులు పూర్తిగా గాలికి వదిలేశారు. ఈ భూములకు సంబంధించిన పూర్తి వివరాలను జిల్లా రిజిస్ట్రార్, రిజిస్ట్రేషన్ల ఐజీకి పంపిస్తే నిషేధిత జాబితాలో పెడతారు. ఇలా చేస్తే క్రయవిక్రయాలు ఆగిపోతాయి. దీనికి ఒక వారం పడుతుంది. కబ్జాకు గురైన 11.54 ఎకరాల భూములు దుర్గామల్లేశ్వరస్వామి ఆలయానికి చెందినవని ఆధారాలు ఉన్నాయి. అయినా అవి ఒకరి నుంచి మరొకరికి చేతులు మారుతూ వెళ్తున్నాయి. రూ.200 కోట్ల విలువైన ఈ భూములను స్వాధీనం చేసుకోవడం పక్కన పెడితే కనీసం నిషేధిత జాబితాలో పెట్టడానికీ అధికారులు చొరవ తీసుకోవడం లేదు. దీనికి ప్రధాన కారణం ఈ భూముల్లో పాగా వేసినోళ్లంతా పెద్దపెద్ద వారే.

సుప్రీంకోర్టు ఆదేశాలున్నా: 2023 డిసెంబరులో ఈ కబ్జా విషయం వెలుగులోకి రాగా కొన్నాళ్లు దేవాదాయశాఖ నుంచి ఈ దస్త్రం బయటకు రానివ్వలేదు. ఆ తర్వాత దేవాయశాఖ నుంచి విడుదలై ఎన్టీఆర్‌ జిల్లా రెవెన్యూ విభాగానికి చేరింది. గత 2 నెలలుగా అక్కడే ఉంటోంది. దుర్గగుడి భూములు ఆక్రమణకు గురైంది వాస్తవమేనంటూ తేల్చి కూడా ఇప్పటికి 9 నెలలు అవుతోంది. విజయవాడకు చెందిన సామాజిక కార్యకర్త కృష్ణారావు సహా మరికొందరు ఏడాదిన్నరగా ఈ భూముల పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్నారు.

అయితే ఈ ప్రక్రియను ఆలస్యం చేయడానికి రెవెన్యూ అధికారులు మరో కొత్తవాదనను తెరపైకి తీసుకొచ్చారని, వీటికి సంబంధించి పలు కేసులు ఉన్నాయని, ఆ వివరాలను సంపాదించాకే ముందుకెళ్లాల్సి ఉంటుందని చెప్తున్నారని కృష్ణారావు మండిపడ్డారు. దేవాదాయశాఖకు చెందిన ఈనాం భూములపై ఎన్ని కేసులున్నా అవన్నీ దేవస్థానానికి చెందుతాయంటూ సుప్రీంకోర్టు గతంలోనే ఇచ్చిన ఆదేశాలు ఉన్నా కబ్జా చేసినోళ్లకు అధికారులకు అండగా ఉంటున్నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.

11.54 ఎకరాల్లో 127 మంది పాగా: సత్యనారాయణపురంలోని పాత సర్వే నంబరు 118, ఆర్‌ఎస్‌ నంబరు 112లోని ఈ భూముల జాబితాను రిజిస్ట్రేషన్ల శాఖకు పంపించాలని దేవాదాయశాఖ కమిషనర్‌ రెవెన్యూ శాఖకు నివేదిక పంపించారు. ప్రస్తుతం విజయవాడ ఉత్తర మండలం ఎమ్మార్వో నుంచి ఈ భూములకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన దస్త్రం ఆర్డీవో కార్యాలయానికి చేరింది. ప్రస్తుతం అక్కడే దస్త్రం ఉంటోంది. ప్రస్తుతం ఈ 11.54 ఎకరాల్లో 127 మంది పాగా వేశారు. వీరిలో కొందరు ఆక్రమించుకున్న వాళ్లుండగా, మరికొందరు వేరేవారి దగ్గర కొని మోసపోయినవాళ్లు ఉన్నారు.

మరో 10 ఎకరాలు: అధికారులు గుర్తించిన 11.54 ఎకరాలతో పాటు కొత్తగా మరో 10.38 ఎకరాల భూమి ఇప్పటికే ఆక్రమించినట్టు తెరపైకి వచ్చింది. రీసర్వే నంబరు 145, పాత సర్వే నంబరు 180లోని టైటిల్‌ డీడ్‌ నెం.131 పరిధిలోని ఈ 10.38 ఎకరాల భూమి దుర్గగుడికి చెందినదేనని ఈనాం రిజిస్టర్‌లో నమోదై ఉన్నట్టు సమాచారం. ఈనాం రిజిస్టర్, ఆర్‌ఎస్‌ఆర్‌ రికార్డు ఇవ్వాలంటూ స.హ దరఖాస్తులు చేసినా అధికారులు మాత్రం ఇవ్వడం లేదు.