News

పాక్‌కు రాజ్‌నాథ్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌.. దెబ్బకు చైనా సైలెంట్‌!

258views

చైనా గడ్డపై దాయాది దేశం పాకిస్తాన్‌కు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చుక్కలు చూపించారు. ఉగ్రవాదాన్ని అడ్డుకునేందుకు ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టినట్టు తెలిపారు. ఆపరేషన్‌ సిందూర్‌ భారత్‌ హక్కు అని కుండబద్దలు కొట్టారు. శాంతి, ఉగ్రవాదం ఎప్పటికీ కలిసి ఉండలేవు అని చెప్పుకొచ్చారు.

చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ(SCO) రక్షణ మంత్రుల సమావేశంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాజ్‌నాథ్‌ మాట్లాడుతూ..‘కొన్ని దేశాలు సీమాంతర ఉగ్రవాదాన్ని ఒక విధాన సాధనంగా ఉపయోగించుకుంటున్నాయి. తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఉగ్రవాదులను పెంచి పోషించే దేశాలు అందుకుతగ్గ పరిణామాలు ఎదుర్కోక తప్పదు. పలు దేశాలు (పరోక్షంగా పాకిస్తాన్‌) ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నాయి. అలాంటి ద్వంద్వ ప్రమాణాలకు చోటు ఉండకూడదు. ఎస్సీఓ అలాంటి దేశాలను విమర్శించడానికి వెనుకాడకూడదు. శాంతి, ఉగ్రవాదం ఎప్పటికీ కలిసి ఉండలేవు. అలాంటి వారి చేతుల్లో విధ్వంసాలకు కారణమయ్యే ఆయుధాలు ఉండకూడదు. ఈ సవాళ్లను ఎదుర్కోడానికి నిర్ణయాత్మకమైన చర్య అవసరం. సామూహిక భద్రత కోసం ఈ దుష్టశక్తులకు వ్యతిరేకంగా పోరాడేందుకు మనమంతా ఐక్యం కావాలి’ అని పిలుపునిచ్చారు.

ఇదే సమయంలో రాజ్‌నాథ్‌.. ఇటీవల జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని గురించి కూడా ప్రస్తావించారు. ఉగ్రవాదులకు దాడికి ప్రతిస్పందనగా భారత్ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ గురించి కూడా వివరించారు. ‘సీమాంతర ఉగ్రవాదాన్ని నిరోధించడానికే భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టింది. మా దేశంపై ఉగ్రదాడులు జరిగిన కారణంగా.. ఆపరేషన్‌ చేపట్టాం. ఆపరేషన్‌ సిందూర్‌ భారత్‌ హక్కు. ఉగ్రవాదుల విషయంలో మేము సహనంతో ఉండే అవకాశమే లేదు. ఉగ్రవాద కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవడానికి వెనుకాడబోం. మన యువతలో రాడికలైజేషన్ వ్యాప్తిని నిరోధించడానికి కూడా మనం సరైన చర్యలు తీసుకోవాలి’ అని వ్యాఖ్యలు చేశారు.

ఇదిలా ఉండగా.. ఎస్‌ఈవో రక్షణ మంత్రుల సమావేశంలో పాల్గొనడానికి రాజ్‌నాథ్‌ సింగ్ చైనా వెళ్లారు. 2020లో గల్వాన్ లోయ వివాదం తర్వాత నరేంద్ర మోదీ మంత్రివర్గంలోని సీనియర్ మంత్రి చేసిన మొదటిసారిగా చైనా పర్యటనకు వెళ్లారు. ఈ సమావేశంలో పాల్గొనడం తనకు ఆనందంగా ఉందని రాజ్‌నాథ్‌ చెప్పుకొచ్చారు. ఇక, గురువారం సమావేశం ప్రారంభమయ్యే ముందు, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, చైనా రక్షణ మంత్రి అడ్మిరల్ డాంగ్ జున్, పాకిస్తాన్, ఇరాన్, కజకిస్తాన్, రష్యా, తజికిస్తాన్‌, ఉజ్బెకిస్తాన్ వంటి సభ్య దేశాల రక్షణ మంత్రులు గ్రూప్ ఫోటో కోసం సమావేశమయ్యారు.