
సనాతన ధర్మం అంటే మీరు ఏదో ఒక విషయాన్ని నమ్మాలి. లేకపోతే మరణిస్తారు అని కాదు. అది అలాంటి సంస్కృతి కాదు. అందుకే, సనాతన ధర్మం విశిష్టతను తెలుసుకుంటే, దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే చాలు ఆ ధర్మంలో తప్పకుండా భాగం అవుతారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఫైజాన్ రిజ్వి అనే ముస్లిం మతస్థుడి ఉదంతమే ఇందుకు తాజా ఉదాహరణ.
మధ్యప్రదేశ్‌లోని మంసౌర్‌కు చెందిన ఫైజాన్ రిజ్వీకి చైతన్య సింగ్ రాజ్‌పుత్‌తో ఏర్పడిన పరిచయం ఆయన్ను హిందూ ధర్మం దాని సిద్ధాంతాలు మరియు విశ్వాసాల వైపు ఆకర్షించింది. వాస్తవానికి చైతన్య సింగ్ రాజ్‌పుత్ కూడా పూర్వం ఇస్లాం మతస్థుడే. కానీ, అతడు రెండేళ్ల క్రితమే ఇస్లాంను త్యజించి హిందూ ధర్మాన్ని స్వీకరించాడు. చైతన్యతో కలిసి ఫైజాన్ తిరుపతితో సహా పలు ధార్మిక క్షేత్రాలను దర్శించుకున్నాడు. ఈ క్రమంలోనే హనుమాన్ భక్తుడిగా మారిన ఫైజాన్ హనుమాన్ చాలీసాను సైతం కంఠస్థం చేశాడు. పూర్తిగా హిందూ ధర్మంలోకి మారాలని తన అభీష్టాన్ని చైతన్యకు తెలియజేయడంతో ఫైజన్‌కు మందసౌర్‌లోని ఆలయంలో శుద్ధి కార్యక్రమం నిర్వహించి సనాతన ధర్మంలోకి ఆహ్వానించారు.
స్వధర్మంలోకి తిరిగి రావడంపై హర్షం వ్యక్తం చేసిన ఫైజాన్ తన పేరును అంగద్ సనాతనిగా మార్చుకున్నట్లు తెలిపాడు. ఇకపై సనాతన ధర్మ ప్రచారంలో విస్తృతంగా పాల్గొంటానని అంగద్ స్పష్టం చేశాడు.




