ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో నేతాజీ వెంట నడిచిన ఆంధ్రులు 63 ; కల్నల్ డి.యస్.రాజు

303views

దేశ స్వాతంత్ర పోరాటంలో అద్భుతపాత్ర పోషించిన వారి గురించి భారతీయులకు వాస్తవాలు తెలియకుండా మరుగున పరిచే యత్నం తొలితరం భారతీయ పాలకులు చేశారు. అలా మరుగున పడిన వారిలో ప్రథముడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపకుడు. జైహింద్ నినాదం అందించిన బోస్ వెంట అడుగులు వేసి, ఆయనకు అత్యంత సన్నిహితులుగా మెలుగుతూ ఆజాద్ హింద్ ఫౌజ్ లో పనిచేసిన తెలుగు వారున్నారు. వారిలో సుభాష్ చంద్రబోస్ కి వ్యక్తిగత సంరక్షకుడుగా, వ్యక్తిగత వైద్యుడిగా పనిచేసిన వారివురు తెలుగువారు కావటం మనకు గర్వకారణం కాగా సామాన్య సైనికుల్లా ఆజాద్ హింద్ ఫౌజ్ లో పనిచేసిన తెలుగువారు మరెందరో ఉన్నారు. తమకంటూ ప్రత్యేక గుర్తింపు కోరుకోక, స్వతంత్ర భారతదేశంలో సామాన్యులుగా జీవితం గడిపారు వారంతా అటువంటి వారిలో ఒకరు కల్నల్ డి.యస్.రాజు.

అకుంఠిత దేశభక్తి ప్రదర్శించిన వీరునిగా, ప్రముఖ విద్యావేత్తగా, ప్రజాసేవకు పరితపించే వైద్యునిగా, కేంద్ర శానససభ సభ్యునిగా, కేంద్రమంత్రిగా, హరిజనోద్ధరణకై అలమటించే సంఘసేవకునిగా ప్రజల హృదయంలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న దాట్ల సత్యనారాయణరాజు కల్నల్ డి.యస్. రాజుగా లోక ప్రసిద్ధుడు.

1904 ఆగష్టు 28న పశ్చిమ గోదావరి జిల్లా, నర్సాపురం తాలూకా, పోడూరు గ్రామంలో రామచంద్రరాజు, సూర్యనారాయణమ్మ దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్య పోడూరు నందు, థర్డ్ ఫారం వరకూ వీరవాసరం మిడిల్ స్కూల్ నందు, యస్.యస్.ఎల్.సి. నరసాపురం టేలర్స్ స్కూలు నందు పూర్తి చేశారు. మదరాసు పచ్చయప్ప కళాశాలలో ఇంటర్మీడియట్, విశాఖపట్నం మెడికల్ కళాశాలలో యం.బి.బి.యస్. పూర్తిగావించారు. తరువాత ఇంగ్లాండులో యమ్.ఆర్.సి.యస్ మరియు యమ్.ఆర్.సి.పి.లను, యఫ్.సి.సి.పి. అమెరికాలోను చదివిన సరస్వతి పుత్రుడు. ఐరోపా దేశాలలో స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాస్వామ్య విలువలకై ప్రముఖులు జరిపే పోరాటాలు, అపూర్వ త్యాగాలచే ప్రభావితుడైనారు. ఆంగ్లేయుల పాలనలో మ్రగ్గుతున్న భారతదేశపు దుస్థితిని తొలగించటానికి తనవంతు కృషిని ప్రారంభించారు. భారతదేశంలో విద్యావంతులతోను, రాజకీయ నాయకులతోను అనేక చర్చలు, ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపారు.

1931 నుండి 1934 వరకు సొంత గ్రామమైన పోడూరులో 20 పడకలుగల హాస్పటల్ ను నిర్వహించారు. తరువాత ఇండియన్ మెడికల్ సర్వీసు (ఐ.ఎం.ఎస్.) నందు కెప్టెన్ గాను, మరియు మేజర్ ను వైద్యరంగంలో తీసుకోబడ్డారు. బొంబాయి, పూనా, బెంగుళూరు, సికింద్రాబాద్ మిలటరీ కేంద్రాలలో వైద్యునిగా మంచి ప్రతిష్ఠనార్జించారు. 1939వ సంవత్సరంలో సుయాపాల్ లో మెడికల్ సూపరింటెండెంటుగా పంపబడ్డారు. చివరకు 1942 సం॥లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారతదేశ విముక్తికై స్థాపించిన ‘అజాద్ హింద్ ఫౌజ్’ (ఇండియన్నేషనల్ ఆర్మీ) నందు సింగపూర్ లో చేరారు. సైనిక శిక్షణ పొంది, వైద్య విద్యావంతుడగుటచే ‘నేతాజీ’కి వ్యక్తిగత వైద్యునిగా, పోరాట యోధునిగా కల్నల్ డి.యస్. రాజు సమర్థవంతమైన పాత్ర నిర్వహించారు. యుద్ధ వ్యూహరచనలో సమర్థునిగా నేతాజీ ప్రశంసలు పొందారు. నేతాజీ ఆగ్నేయ ఆసియా పై చేసిన ‘ఛలో ఢిల్లీ’ దండయాత్రలో భారతీయ సైన్యాలకు నిరుపమానమైన వైద్య సేవలందించారు. దురదృష్టవశాత్తు విమాన ప్రమాదంలో ‘నేతాజీ’ అదృశ్యం కావటంతో ‘అజాద్ హింద్ ఫౌజ్’ వెనుకబడింది.

బ్రిటిష్ ప్రభుత్వం కల్నల్ డి. యస్. రాజును అరెస్టు చేసి 1945 మార్చి నుండి 1946 మార్చి వరకు ఒక సంవత్సరం ఎర్రకోటలో నిర్బంధించింది. విడుదల తరువాత 1946లో రాజమండ్రిలో ‘నేతాజీ మెడికల్ మిషన్’ను స్థాపించి ప్రజలకు వైద్య సేవలను అందించారు. కాకినాడ మెడికల్ సొసైటీకి ఎనిమిది సంవత్సరాల అధ్యక్షునిగా కొనసాగారు. భారత పార్లమెంటుకు 1957, 1962, 1967లలో వరుసగా మూడు పర్యాయాలు రాజమండ్రి నుండి ఎన్నికై 15 సం॥రాలు చట్టసభలలో తన వాణి వినిపించారు. రాజు ప్రతిభను గుర్తించి, భారత ప్రభుత్వం 1957లో ఆరోగ్యశాఖ ఉపమంత్రిగాను, 1962 భారత సైనిక శాఖ ఉపమంత్రిగా నియమించి ఆయన సేవలను పొందింది. ప్రపంచ ఆరోగ్య మహాసభలకు భారత ప్రతినిధిగా జినోవా మరియు బిల్ కోలి వెళ్ళారు. వ్యక్తిగత ప్రతిభతో రాజకీయాలలో పెట్టి వెలుగొందిన డి.యస్. రాజు గోదావరి జిల్లాలో హరిజనోద్దరణ చేపట్టి, వారికి విద్య, వైద్య సదుపాయాలు కల్పించటంలో ఎంతో కృషి చేశారు.

జాతి కోసం జీవితాన్నంతా సమర్పించిన ఈ క్షత్రియవీరుడు జూన్ 5, 1973న కీర్తిశేషులైనారు. పోడూరు గ్రామ ప్రజలు తమ గ్రామ ఆదర్శమూర్తిగా వారి సేవలు గుర్తించి కల్నల్ డి.యస్. రాజు స్కూలును స్థాపించి గౌరవించారు.