News

తేజో విరాజితం.. సుదర్శన నారసింహ యజ్ఞం

363views

నృసింహ స్వామివారు కొలువైన సింహాచలం క్షేత్రంలో జరుగుతున్న సుదర్శన నారసింహ మహాయజ్ఞం తేజో విరాజితంగా కొనసాగుతోంది. యజ్ఞంలో భాగంగా శనివారం విశేష హోమాలు, పారాయణలు, పూజలు సంప్రదాయబద్ధంగా జరిగాయి. అర్చకులు వేకువజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ఆరాధన, బాలభోగం సేవలు జరిపారు. శ్రీదేవి, భూదేవి సమేతుడైన స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజ స్వామిని చూడముచ్చటగా అలంకరించి బంగారు తొళక్కియాన్‌లో ఊరేగింపుగా యాగశాల ప్రవేశం చేయించారు. సుదర్శన మూర్తి కొలువైన యాగశాలలో చతుర్వేద హవన పూర్వక పాంచాహ్నిక పంచకుండాత్మక సుదర్శన నారసింహ యజ్ఞాన్ని పండితులు వేదోక్తంగా జరిపించారు. భక్తులు అశేషంగా పాల్గొని యజ్ఞ పురుషుడిని సేవించారు. విశాఖ జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లికార్జున, రాష్ట్ర దేవాదాయశాఖ అదనపు కమిషనర్‌, అన్నవరం దేవస్థానం ఈవో కె.రామచంద్రమోహన్‌ సతీసమేతంగా హోమంలో పాల్గొన్నారు. ఈవో సింగల శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో అధికారులు ఏర్పాట్లు పర్యవేక్షించారు.