ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసామాన్య, అసామాన్యులు – 50 ; వాడ్రేవు జగ్గరాజు

419views

మహాత్మాగాంధీ నాయకత్వంలో అహింసా శాంతియుత మార్గాలలో జరిగిన స్వాతంత్య్ర సమరంలో అనేకమంది అనుపమ త్యాగాలు చేశారు. అనేక సాహసాలు చేశారు. ఒక్కొక్కరిది ఒక కథ. అయితే కొందరు చరిత్రలో స్థిరంగా ఉండిపోయే సాహసాలు చేశారు ఆంధ్రకేసరి ప్రకాశం తుపాకీగుళ్ళకు గుండెను చూపడం, తోట నర్సయ్య బందరు కోనేరు సెంటరు స్తంభంపై జెండాను ఎగరవేయడం ఇటువంటివి ఇట్టి సాహసాన్ని చేసి చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించినవారు – కోనసీమ వాస్తవ్యులు వాడ్రేవు జగ్గరాజు గారు.

అది 1931వ సంవత్సరం. ఉప్పు సత్యాగ్రహ కాలం. కలకత్తాలో అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు జరుగవలసి ఉంది. ఈ సభ జరగకుండా అడ్డుకోవాలని సభకు వస్తున్న వారిని దారిలోనే అరెస్ట్ చేయాలని బ్రిటీష్ ప్రభుత్వం భావించింది. ఎలాగైనా ఈ సమావేశంలో పాల్గొనాలని జగ్గరాజుగారు మారువేషంలో కలకత్తాకు బయలుదేరారు. పిఠాపురానికి చెందిన ఒక వర్తకుడు కలకత్తా వెళుతూ ఉంటే ఆయన నౌకరుగా జగ్గరాజుగారు మారారు. వర్తకుడు జగ్గరాజుగారిపై ఉన్న గౌరవంతో పూర్తిగా సహకరించారు. జగ్గరాజుగారు కలకత్తా చేరుకున్నారు.

ఈ మహాసభలకు మదన్ మోహన్ మాలవ్యా అధ్యక్షత వహించవలసి ఉంది.పోలీసులు వారిని దారిలోనే అరెస్ట్ చేశారు. అంతేకాక సమావేశ ఆవరణలోకి రాకుండా పోలీసులు గట్టి బందోబస్తు చేశారు. ఆ విధంగా కాంగ్రెస్ మహాసభలు జరుగకుండా అడ్డుకోవాలని పోలీసుల ప్రయత్నం. ఇది పసిగట్టిన సభా నిర్వాహకులు ఆసు అప్పటికప్పుడు సమావేశ స్థలాన్ని వేరొక చోటికి మార్చారు. మాలవ్యా అరెస్టయినందు శ్రీమతి నెల్లిసేన్ గుప్తా సమావేశాలకు అధ్యక్షత వహించారు. జగ్గరాజు గారు పోలీసులు చితకబాదుతున్నా లెక్కచేయక కాంగ్రెస్ పతాకాన్ని ఎగరవేశారు. నెల్లీసేన్ గుప్తాను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకు వెళ్ళిపోగా మహాసభ ప్రతినిధులు జగ్గరాజుగారిని అధ్యక్షస్థానంలో కూర్చోబెట్టారు. ఒక వంక వరం – మరొక వంక పోలీస్ లాఠీల ఝళిపింపులు – లాఠీ ఛార్జి జరుగుతూ ఉండగానే సమావేశతీర్మానాలన్నీ జగ్గరాజుగారు చదివారు. చివరకు పోలీసు లాఠీచార్జీకి స్పృహ కోల్పోయారు. జగ్గరాజు గారిని అరెస్ట్ చేసి ఆలీపూర్ సెంట్రల్ జైలుకు పంపారు.

1903 సం||లో జగ్గరాజుగారు అమలాపురం సమీపంలోని గంగలకుర్రు గ్రామంలో జన్మించారు. బందరు ఆంధ్ర జాతీయకళాశాలలో చదువుతూ మహాత్మాగాంధీ పిలుపును శిరసావహించి స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నారు. సహాయ నిరాకరణ ఆందోళనలో పాల్గొని 13-03-1922 నుంచి 19-04-1922 వరకు రాజమండ్రిలో జైలుజీవితం అనుభవించారు. మీరట్ కుట్రకేసులో జగ్గరాజుగారికి ప్రమేయం ఉంది. కేరళలోని వైకం దేవాలయ సత్యాగ్రహం – హరిజనుల దేవాలయంలో ప్రవేశింపచేయడానికి ఇది జరిగింది. నాగపూర్ జెండా సత్యాగ్రహం, అకాలీ లాహోరు సత్యాగ్రహం, తారకేశ్వరీ బెంగాల్ సత్యాగ్రహం వంటి పోరాటాలలో జగ్గరాజుగారు పాల్గొన్నారు. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీలో చేరిన ప్రథములలో వీరొకరు.

మదనమోహన మాలవ్యాకు జగ్గరాజుగారు అత్యంత సన్నిహితులుగా ఉండేవారు జెండా సంఘటన సందర్భంగా అరెస్ట్ అయి జైలునుంచి వచ్చిన తర్వాత మాలవ్యా జగ్గరాజు గారిని కాశీలోని తన నివాసంలో ఉంచుకుని ఎంతగానో ఆదరించారు. 1925 నుంచి జరిగే ప్రతి కాంగ్రెస్ మహాసభలకు హాజరు కావడమే కాక, తీర్మానాల పై జరిగిన చర్చలలో పాల్గొనేవారు. సమావేశాల సమయం తాను చురుకుగా ఉండడమే కాక ఇతరులకు చురుకుదనం కలిగించేవారు. నెల్లూరు సమీపంలోని పల్లెపాడు గ్రామంలో దిగుమర్తి హనుమంతరావుగారు స్థాపించిన పినాకినీ సత్యాగ్రహ ఆశ్రమాభివృద్ధికి జగ్గరాజు గారు, ఆంధ్ర స్వరాజ్య పత్రికకు సంపాదకులు గుమ్మడి రాం సుబ్బారావు గారు ఎంతో కృషి చేశారు.

జగ్గరాజుగారు మొత్తం మూడు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు. ఈ మూడు సంవత్సరాలలో ఆయన పదకొండు జైళ్ళను చూశారు. మద్రాస్ ముఖ్యమంత్రి పి.ఎన్.కుమారస్వామి రాజా, విద్యామంత్రి చెట్టియార్, ముసలికంటి విధుకులరావుగారు వీరి తోటి రాజకీయ ఖైదీలు.