మగవారిలో మహర్షులున్నట్లే, మహిళామణుల్లో కూడా తీవ్ర జప తపాలను ఆచరించిన ఆధ్యాత్మికవేత్తలున్నారు. మహిళ రుషిత్వం పొందితే ‘రుషిక’ అంటారు. పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచర్యం పాటించి యజ్ఞాలు చేసే యోగ్యత గల స్త్రీలను ‘బ్రహ్మవాదినులు’ అంటారు. మన సంప్రదాయంలో అలాంటివారెందరో. వేదాలను ఉపదేశించే ‘వచక్ను’ అనే మహానుభావుని పుత్రిక గార్గి. వేదాలు, ఉపనిషత్తులు క్షుణ్ణంగా అభ్యసించి విశేష జ్ఞానాన్ని ఆర్జించిందామె.
మమత, విశ్వవారా, ఘోషా, సూర్యా, లోపాముద్ర.. తదితర రుషికలు వేద వాఙ్మయంలో కనిపిస్తారు. వేదాలను చక్కగా అధ్యయనం చేసిన వెయ్యిమంది బ్రాహ్మణులున్న సదస్సులో, బ్రహ్మాన్ని గురించిన చర్చలో గార్గి ధైర్యంగా యాజ్ఞవల్క్యుని ఎదిరించి నిలిచింది. ఇక శ్రీశైలం సమీపంలో అక్క మహాదేవి మహాతపస్విని. పురుషుల కన్నా స్త్రీలకు మనోనిగ్రహం, నిష్ఠ ఎక్కువని మన ధర్మం ఘోషిస్తోంది.
అందుకే ‘వేదకాలంలోనూ, ఉపనిషత్ యుగంలోనూ పూజ్యనీయులైన మైత్రేయి, గార్గి తదితర స్త్రీలు బ్రహ్మాన్ని గురించి చర్చించారు. తమ సామర్థ్యంతో రుషుల స్థానాన్ని అలంకరించారు. ఆధ్యాత్మిక సాధనల్లో స్త్రీలే పురుషుల కన్నా ఎంతో ముందుంటారు’ అన్నారు స్వామి వివేకానంద. అనసూయ, అరుంధతి వంటి తపస్వినులు పారమార్థిక శిరోమణులన్న సంగతి విదితమే కదా!
-ప్రహ్లాద్