రాష్ట్రవ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా దీపావళిని నిర్వహించారు. శ్రీదేవి, భూదేవీ సమేత మలయప్ప స్వామికి సహస్ర దీపాలంకరణ చేశారు. విజయవాడ గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో లక్ష్మీ యాగం.. మార్కాపురంలోని పలు వీధుల్లో నరకాసురుని వధ నిర్వహించారు. అంతేకాకుండా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో నరకసుర వధను ఏర్పాటు చేయగా.. ప్రజలు అసక్తిగా తిలకించారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో పండుగ సందర్భంగా దీపావళి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. దీపావళి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఊరూ వాడ సందడి నెలకొంది. ప్రకాశం జిల్లా మార్కాపురంలో పండగ సందర్భంగా నరకాసురుని వధ నిర్వహించారు. సంప్రదాయ బద్ధంగా రుక్మిణీ, సత్యభామ అవతారంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఊరేగింపుగా వచ్చి.. నరకాసురున్ని వధించారు. కార్యక్రమాన్ని తిలకించేందుకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం తుమ్మలగుంటలో నరకాసుర వధ అట్టహాసంగా నిర్వహించారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు, కొత్తపేట మండలాల్లో ప్రజలు ప్రమీదలు వెలిగించి వేడుకలు జరుపుకొన్నారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరంలో మహిళలు లక్ష్మీ పూజలు నిర్వహించి పిల్లలతో దివిటీలు కొట్టించి వేడుకలు నిర్వహించారు. విశాఖ శారదాపీఠంలో దీపావళి వేడుకల్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.




