
దివ్వెల పండగకు ఒక్క రోజు ముందుగానే అయోధ్య నగరం దివ్య తేజో వర్ణ రంజితమైంది. సరయూ నదీ తీరంలో లక్షల దీపాల వెలుగులు దివిని భువిని ఏకం చేశాయి. సరికొత్త ప్రపంచ రికార్డునూ సృష్టించాయి. దీంతో రామనగరి శోభాయమానమైంది. రామ మందిరం త్వరలో ప్రారంభం కానుందనే సంరంభం నగర మంతటా కనిపించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో సరయూ నదీ తీరాన గత ఏడేళ్లుగా దీపావళికి ముందు రోజు దీపోత్సవం నిర్వహిస్తున్నారు. ఈసారి దీపోత్సవం ప్రత్యేకతను సంతరించుకుంది. శనివారం సాయంత్రం సరయూ తీరంలోని 51 ఘాట్‌లలో 22లక్షలకు పైగా దీపాలను అందంగా తీర్చిదిద్దారు.
వనవాసాన్ని ముగించుకుని సీతాసమేతంగా అయోధ్యలో అడుగుపెట్టిన శ్రీరామునికి ఆయన సోదరులు భరత శతృఘ్నులు స్వాగతం పలికిన సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహించే రథోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ అనందీబెన్ పటేల్ పాల్గొన్నారు. అనంతరం నదీ తీరంలో యోగి ఆదిత్యనాథ్ సరయూ హారతి నిర్వహించి, ‘దీపోత్సవ్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
25వేల మంది వాలంటీర్లు 22లక్షలకు పైగా దీపాలను వెలిగించారు. ఈ కార్యక్రమానికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధుల బృందం హాజరై.. డ్రోన్ కెమెరాతో వెలిగించిన దీపాలను లెక్కించారు. ప్రపంచ రికార్డును ధ్రువీకరిస్తూ ముఖ్యమంత్రికి సర్టిఫికేట్‌ను అందించారు. 54 దేశాలకు చెందిన రాయబారులు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
దీపోత్సవ్‌కు ముందు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. రామాయణం, రామచరిత మానస్‌తో పాటు వివిధ సామాజికాంశాల ఇతివృత్తంతో రూపొందించిన శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. వేల మంది ప్రజలు ఆయా కార్యక్రమాలను వీక్షించారు. దీపోత్సవం అనంతరం ప్రత్యేక లేజర్ షో ఏర్పాటు చేశారు.
దివ్వెల వెలుగులతో రికార్డులను చెరిపేస్తూ..
2017లో యూపీలో భాజపా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏటా అయోధ్యలో ఈ దీపోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. గతేడాది 15లక్షల దీపాలను వెలిగించగా ఈ ఏడాది ఆ రికార్డును బద్దలుకొట్టారు.




