News

ప్రసాద్ పథకం పరిధిలోకి నెల్లూరు శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం

301views

భారతదేశం అంతటా పుణ్యక్షేత్రాలను అభివృద్ధి పరచి, ఆధ్యాత్మిక పర్యాటకాన్ని వృద్ధి చేసే ఉద్దేశంతో భారత ప్రభుత్వం 2014-15లో ప్రారంభించిన Pilgrimage Rejuvenation and Spiritual Augmentation Drive -ప్రసాద్ పథకం పరిధిలోకి నెల్లూరులోని శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని తీసుకొస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు చొరవ తీసుకుని గతంలో ప్రసాద్ పథకం కింద ఈ ఆలయాన్ని పరిశీలించాలని కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖకు సూచన చేశారు. ఫలితంగా గతంలో పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆలయాన్ని దర్శించి వెళ్లారు. అనంతరం నరసింహకొండను ప్రసాద్ పథకం పరిదిలో చేరుస్తున్నట్లు అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి.

ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు ఒక ప్రకటన విడుదల చేస్తూ ఈ ప్రక్రియలో చొరవ తీసుకున్న వారందరికి అభినందనలు తెలిపారు. ఈ పథకం పరిధిలోకి రావడం ద్వారా ఆలయం అభివృద్ధికి కావాల్సిన విధులను భారత ప్రభుత్వం విడుదల చేస్తుంది. ముందుగా అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం అందజేయాల్సి ఉంటుంది. ఆధ్యాత్మిక శోభతో భాసిల్లుతున్న అల యానికి ఈ పథకం ద్వారా పర్యాటకంగానూ మెరుగులు దిద్దనున్నారు. ఫలితం గా నెల్లూరు ఆధ్యాత్మిక సిగలో మరో ధార్మిక పుష్పం వికసించనుంది.