
ఇజ్రాయెల్‌పై పోరులో పాలస్తీనా, హమాస్ తిరుగుబాటుదారులకు మద్దతుగా పాకిస్థాన్, బంగ్లాదేశ్ సహా మరికొన్ని దేశాల హ్యాకర్లు రంగంలోకి దిగగా..భారత హ్యాకర్ల బృందమొకటి గట్టి షాకిచ్చింది. పాలస్తీనా, హమాస్‌లకు చెందిన కీలక వెబ్‌సైట్‌లను హ్యాక్ చేసి నివ్వెరపర్చింది. హమాస్ తిరుగుబాటుదారులు, ఇజ్రాయెల్ బలగాల మధ్య ప్రస్తుతం భీకర దాడులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాలస్తీనా, హమాస్‌కు మద్దతుగా ఓపీఇజ్రాయెల్, ఓపీఇజ్రాయెల్2 పేరుతో మిస్టీరియస్ టీమ్ బంగ్లాదేశ్, అనానమస్ సూడాన్, టీమ్ ఇన్‌సాన్ పాకిస్థాన్ హ్యాకర్ల బృందాలు రంగంలోకి దిగాయి.
ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలు, ప్రభుత్వ వెబ్‌సైట్‌లపై సైబర్ దాడులకు ప్రయత్నించాయి. అయితే సైబర్ దాడులు జరగకుండా ఇజ్రాయెల్ తన అధికారిక వెబ్‌సైట్‌లను జియో లాకింగ్ చేసి ఉండటంతో.. వాటి ప్రయత్నాలు ఫలించలేదు. ఈ మేరకు డార్క్‌నెట్‌లో హ్యాకర్ల మధ్య సంభాషణలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో ‘ఇండియన్ సైబర్ ఫోర్స్’ అనే పేరుతో పనిచేస్తున్న భారత హ్యాకర్ల బృందం ఇజ్రాయెల్‌కు మద్దతుగా వచ్చింది. పాలస్తీనా ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్‌లతో పాటు హమాస్ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసి షాకిచ్చింది. పాలస్తీనా వెబ్ మెయిల్ ప్రభుత్వ సర్వీస్, పాలస్తీనా జాతీయ బ్యాంకు వెబ్‌సైట్, పాలస్తీనా టెలీ కమ్యూనికేషన్ కంపెనీలతో పాటు హమాస్ అధికారిక వెబ్‌సైట్‌లను తాము హ్యాక్ చేసినట్లు ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా వెల్లడించింది.




