
అక్టోబర్ 15–23 వరకు తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో నిన్న జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో భక్తుల ప్రశ్నలకు ఈవో సమాధానమిచ్చారు. నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ఈ నెల 14న అంకురార్పణ చేయనున్నామని తెలిపారు. బ్రహ్మోత్సవాల తేదీల్లో అన్ని రకాల ప్రత్యేక దర్శనాలను రద్దు చేశామన్నారు. అక్టోబర్ 8, 13, 14, 15వ తేదీల్లో తిరుపతిలో ఇచ్చే స్లాటెడ్ సర్వ దర్శనం -ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీ నిలిపివేసినట్లు స్ఫష్టం చేశారు.వైకుంఠ ఏకాదశి సందర్భంగా డిసెంబరు 23 నుంచి వచ్చే ఏడాది జనవరి 1 వరకు దర్శనానికి వీలుగా రెండు లక్షల టికెట్లను త్వరలోనే ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నామని తెలిపారు. తిరుమలలో యూపీఐ విధానంలో చెల్లింపులు చేసి గదులు పొందిన భక్తులకు వారు గదులు ఖాళీ చేసిన గంటలోపు కాషన్ డిపాజిట్ మొత్తం రీఫండ్ చేస్తున్నట్లు తెలిపారు.




