
ఇటీవల హత్యకు గురైన గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ (Atiq Ahmed) ఉత్తర ప్రదేశ్‌లో పెద్ద ఎత్తున భూకబ్జాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. సమాజ్‌వాదీ పార్టీలో ఉంటూ, ఎమ్మెల్యే, ఎంపీ పదవులను నిర్వహించిన అతిక్ ఇష్టారాజ్యంగా వ్యవహరించాడు. అలాంటి సమయంలో అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) బంధువు భూమిపై కూడా అతని కన్ను పడినట్లు తెలుస్తోంది. అయితే సోనియా తక్షణమే జోక్యం చేసుకోవడంతో అతిక్ పప్పులు ఉడకలేదు. అప్పట్లో కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఉండటం అతనికి మైనస్ పాయింట్ అయింది.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, సోనియా మామ గారైన ఫిరోజ్ గాంధీ కుటుంబానికి చెందినవారు వీర గాంధీ. ప్రయాగ్‌రాజ్‌లోని సివిల్ లైన్స్ ప్రాంతంలో వీర గాంధీకి స్థలం ఉంది. ఆ స్థలాన్ని అతిక్ కబ్జా చేసి, తన మనుషులను అక్కడ పెట్టాడు.
ఫిరోజ్ తోడల్లుడి సమీప బంధువైన వీర వెంటనే సోనియా గాంధీ సహాయాన్ని కోరారు. వెంటనే సోనియా జోక్యం చేసుకుని, అప్పటి ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు రీటా బహుగుణ జోషీతో మాట్లాడారు. రీటా జిల్లా యంత్రాంగంతో మాట్లాడారు. దీంతో అతిక్ వెనుకంజ వేసి, ఆ భూమిని తిరిగి వీర గాంధీకి అప్పగించాడు.
వీర గాంధీకి దక్కని ప్రభుత్వ అండ
వీర గాంధీకి సహాయపడటానికి స్థానిక పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ముందుకు రాలేదని మీడియా కథనాలనుబట్టి తెలుస్తోంది. అయితే అతిక్ హత్య తర్వాత వీర గాంధీని మీడియా సంప్రదించింది. కానీ అతిక్ గురించి తానేమీ మాట్లాడబోనని వీర చెప్పారు. అయితే రీటా మాత్రం ఈ విషయాన్ని ధ్రువీకరించారు. వీర గాంధీ భూమి విషయంలో తనతో సోనియా గాంధీ మాట్లాడారని, తాను జిల్లా యంత్రాంగంతో మాట్లాడానని, ఫలితంగా అతిక్ వెనుకంజ వేసి, భూమిని వదిలేశాడని చెప్పారు.
అతిక్‌పై 100కుపైనే కేసులు
అతిక్ అహ్మద్‌పై 100కుపైగా కేసులు ఉన్నాయి. హత్యలు, హత్యాయత్నాలు, అపహరణలు, బలవంతపు వసూళ్ళు వంటి కేసులు ఉన్నాయి. అతిక్ ఆస్తుల విలువ అనేక వేల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. రూ.1,169 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. వీటిలో రూ.750 కోట్ల విలువైన ఆస్తులను ధ్వంసం చేయగా, రూ.417 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకుంది. అతను సంపాదించిన ఆస్తుల్లో ఇది సముద్రంలో నీటి బొట్టు వంటిదని అధికారులు చెప్తున్నారు.
ఎన్నికల అఫిడవిట్‌లో..
2019 లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి నియోజకవర్గం నుంచి అతిక్ పోటీ చేశాడు. తనకు గల స్థిర, చరాస్తుల విలువ రూ.25 కోట్లు అని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నాడు.
అయితే మూడేళ్ల నుంచి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అతని హవాను తగ్గించడానికి ప్రయత్నిస్తోంది. అతని ఆర్థిక సామ్రాజ్యంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) ఇటీవలే దర్యాప్తు ప్రారంభించింది. ఉత్తర ప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో దాడులు చేసింది.





