News

క్యాంటమ్‌ మిషన్‌ ఏర్పాటును ఆమోదించిన కేంద్రం.. ఆరో వేల కోట్లతో ప్రాజెక్టు!

244views

దేశంలో సమాచార మార్పిడి విషయంలో పటిష్టమైన భద్రను ఏర్పాటు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందులో భాగంగా తాజాగా దేశ ప్రధాని మోదీ నేతృత్వంలో జాతీయ క్వాంటమ్ మిషన్ లో భాగంగా దాదాపు రూ.6,003.65 కోట్ల ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ ప్రాజెక్ట్‌ను ఓకే చేశారు. 2023-24 నుంచి 2030-31 మధ్య క్వాంటమ్ టెక్నాలజీ అభివృద్ధి, పరిశోధనల కోసం ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నారు. ఈ ఎనిమిదేళ్ల కాలంలో వివిధ రకాల క్వాంటమ్ కంప్యూటర్లను తయారు చేయనున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. క్వాంటమ్ సాంకేతికత ద్వారా జరిగే సమాచార మార్పిడికి పటిష్టమైన భద్రత ఉంటుందని ఆయన తెలిపారు. క్వాంటమ్ కమ్యూనికేషన్ నురక్షితమైన వ్యవస్థగా చెప్పుకోవచ్చని.. దీని ద్వారా ఇద్దరి మధ్య జరిగే సంభాషణలు ఎవరూ హ్యాక్ చేయలేరని.. క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ క్రిప్టోగ్రపీ ద్వారా జరిగే సంభాషణలను ఎవరైనా హ్యాక్ చేయాలని ప్రయత్నిస్తే.. ఇందులోని భద్రత వ్యవస్థ మెసేజ్ పంపిన వ్యక్తిని అప్రమత్తం చేస్తుందన్నారు. దీంతో మెసేజ్ డిలీట్ చేయడం లేదా అందులోని సమాచారం మరోలా మారిపోవడం జరుగుతుందన్నారు. క్వాంటమ్ సెన్సింగ్ సాయంతో కచ్చితత్వం, సున్నితత్వంతో కూడిన సెన్సర్ వ్యవస్థలను అభివృద్ధి చేయవచ్చని. ఇవి వాతావరణ ఉష్ణోగ్రతలు, అయస్కాంత క్షేత్రాలు, గురుత్వాకర్షణ తరంగాలను కచ్చితత్వంతో కొలుస్తాయన్నారు.

భవిష్యత్తులో దృష్టిలో ఉంచకుని .. క్వాంటమ్ టెక్నాలజీ అవసరాన్ని గుర్తించిన కేంద్రం ఎన్‌క్యూఎమ్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ప్రభుత్వ సంస్థల్లో క్వాంటమ్ కంప్యూటింగ్, క్రిప్టోగ్రఫీ, కమ్యూనికేషన్, సెన్సింగ్, మెట్రాలజీ ఆధారంగా నాలుగు క్వాంటమ్ టెక్నాలజీ హబ్‌లను ఏర్పాటు చేయనుంది. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో క్వాంటమ్ రంగానికి చెందిన శాస్త్రవేత్తలతో కూడిన ఓ ప్రభుత్వ కమిటీ ఈ హబ్ లో జరిగే పరిశోధనలకు పర్యవేక్షిస్తుంది. రాబోయే మూడేళ్లలో 2,000 కిలోమీటర్ల క్వాంటమ్ కమ్యూనికేషన్ వ్యవస్థను నెలకొల్పడంతోపాటు, ఎనిమిదేళ్ల కాలంలో 20 నుంచి 50 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్లను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేయనుంది. క్వాంటమ్ టెక్నాలజీ అనేది భౌతిక శాస్త్రం, ఇంజనీరింగ్ విభాగాల కలయిక. ఇది గణితం, భౌతికశాస్త్రం, కంప్యూటర్ సైన్స్ లోని మౌలికాంశాల ఆధారంగా పనిచేస్తుంది. ఇందులోని క్వాంటమ్ మెకానిజమ్‌ సూత్రాల ఆధారంగా కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేయవచ్చు. ఈ క్వాంటమ్ మెకానిజమ్ శక్తిని పరమాణువులు సామర్థ్యంతో కొలుస్తాయి.
ప్రపంచ వ్యాప్తంగ అయిదు దేశాల్లో మాత్రమే.. ఇప్పటి వరకు క్వాంటన్ టెక్నాలజీ గురించి పరిశోధనలు జరుగుతున్నాయి. అమెరికా, చైనా, ఫ్రాన్స్, ఆస్ట్రియా, ఫిన్లాండ్ ఈ జాబితాలో ఉండగా.. ఇప్పుడు ఇండియా కూడా ఈ టెక్నాలజీపై పరిశోధనలు చేపట్టనుంది. ప్రస్తుతం ఈ దేశాల ప్రాజెక్టు పరిశోధన, అభివృద్ధి దశల్లోనే ఉన్నాయి. ఇస్రో శాస్త్రవేత్తలు శాటిలైట్ ఆధారిత క్వాంటమ్ కమ్యూనికేషన్ వ్యవస్థను గతేడాది అందుబాటులోకి తీసుకురాగా.. ఇక తాజాగా కేంద్రం ప్రకటించిన విధంగా చూస్తే.. భారత్‌ క్యాంటమ్ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చేస్తుందని భావించవచ్చు.