
సముద్ర తీరాన్ని చూడాలని ఎవరికి ఉండదు. మరీ ముఖ్యంగా చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు వయసుతో సంబంధం లేకుండా.. బీచ్‌లకు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటాం. అక్కడ ఉండే ఇసుకలో గూళ్లు కట్టుకుంటాం.. పేర్లు రాసుకుంటూ.. సముద్రపు అలలను ముట్టుకుంటూ.. వాటితో హాయిగా గడిపేస్తాం. ఇవన్నీ అందరూ సాధారణంగా చేసే పనులే. ఇక ఆంధ్రప్రదేశ్‌లోనే పేరుగాంచిన బీచ్ ప్రాంతం వైజాగ్‌లో ఉంది. ఈ ప్రాంతాన్ని ఇష్టపడని వారు ఉండరు. ఇక్కడ అందమైన సముద్ర తీరం మాత్రమే ప్రత్యేకం కాదు. మరో విశేషం కూడా ఉంది. అదేమిటంటే.. సముద్రంలో జీవించే అనేక జీవ జాతుల గురించి తెలుసుకునే అవకాశం ఉంది. అదెలా అంటారా.. పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి..
సాధారణంగా తీర ప్రాంతంలో ఆటుపోటులు తక్కువగా ఉన్నప్పుడు రంగురంగుల సముద్ర జాతులను అందరూ అన్వేషిస్తుంటారు. పిల్లలు కూడా వాటి పేరేంటని తల్లిదండ్రులను అడుగుతుంటారు. కానీ చాలా మంది వాటి పేర్లు, అవి ఏం చేస్తాయో వివరించలేదు. ఇలాంటి వారితోపాటు.. సముద్ర జీవుల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న వారి కోసం.. విశాఖపట్నంలోని స్టార్టప్-వైల్డ్‌ఎడ్ బృందం, ఈస్ట్ కోస్ట్ కన్జర్వేషన్ టీమ్ సహకారంతో విశాఖపట్నం బీచ్‌లో ‘ఇంటర్ టైడల్ వాక్స్’తో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇది పిల్లల నుంచి పెద్దల వరకు అనేక మందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
సముద్రం తీరం వెంబడి కొంత దూరంలో ‘ఇంటర్ టైడల్ వాక్స్’ను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో అలలు తక్కువగా ఉంటాయి. ఇక్కడికి ఆ సంస్థ సిబ్బంది పర్యాటకులను తీసుకెళ్లి.. సముద్ర జాతులను వారికి పరిచయం చేస్తారు. ఈక్రమంలో వివిధ జాతులను మనం ఫొటోలు, వీడియోలు కూడా తీసుకోవచ్చు. పెద్ద సమూహంతో వెళ్లి అక్కడ ఉన్న సముద్ర జీవులను అన్వేషిస్తారు. సముద్ర నక్షత్రాలు, ఎనిమోన్లు, బార్నాకిల్స్, వివిధ ఆల్గేలు, పీతలు, గ్యాస్ట్రోపాడ్స్, రొయ్యలు, ఈత పీతలు వంటి అనేక రకాల అద్భుతమైన సముద్ర జీవులను మనం చూడవచ్చు. స్పాంజ్‌లు, హైడ్రాయిడ్‌లు, సముద్రపు స్లగ్‌లు, రాక్ అర్చిన్‌లు వంటి అరుదైన జాతుల గురించి తెలుసుకోవచ్చని.. వైల్డ్‌ఎడ్ వ్యవస్థాపకుడు విమల్ రాజ్ చెబుతున్నారు. గత ఏడాది కాలంలో విశాఖ తీరం వెంబడి 150కి పైగా జాతులను గుర్తించినట్లు ఆయన తెలిపారు.




