News

తెలుగు రాష్ట్రాలపై భానుడి ప్రతాపం.. భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలు

274views

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఉదయం పది నుంచే ఇంటి నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు బయపడుతున్నారు. ఎండ వేడిమిని తట్టుకోలేక ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇంటిపట్టునే ఉన్న వారిని కూడా ఉక్కపోత ఉక్కిరి బిక్కిరి చేస్తొంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాల్పులు కూడా అధికమవడంతో.. వాతావరణ శాఖలు పలు హెచ్చరికలు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో 44 డిగ్రీల కన్నా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏపీలో 98 మండలాలకు వడగాల్పుల హెచ్చరికలు జారీ అయ్యాయి. తెలంగాణలో రామగుండం, జయశంకర్ భూపాలపల్లి, సింగరేణి, నిర్మల్, మంచిర్యాల ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఇలాంటి సమయంలో వడదెబ్బల బారిన పడకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

ఒక ప్రాంతంలో గరిష్ట ఉష్ణోగ్రత మైదాన ప్రాంతాల్లో అయితే.. 40 డిగ్రీలు అంతకంటే ఎక్కువ, కొండ ప్రాంతాల్లో ఉండే వారైతే.. 30 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువ ఉంటే వేడి గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరిస్తోంది. వేడి తరంగాలు సాధారణంగా మార్చి నుంచి జూన్ వరకు సంభవిస్తాయని.. ఇక మే నెలలో భారతదేశంలో వేడి తరంగాలు గరిష్టంగా ఉంటాయని చెబుతోంది. వడదెబ్బ వల్ల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని.. తల నొప్పి, వాంతులు, కాళ్ల తిమ్మిర్లు, అలసట, మూర్చ వంటి లక్షణాలు కనిపిస్తాయని అంటున్నారు.

వడదెబ్బ తగలకుండా ఉండేందుకు.. ప్రతి ముక్కరూ పుష్కలంగా నీరు తాగాలి. ఎండాకాలంలో చెమట రూపంలో శరీరం నుంచి ఎక్కువగా నీరు బయటకు పోతుంది. కాబట్టి దానిని భర్తీ చేసేందుకు అధిక మొత్తంలో నీరు తాగాలి. అదేవిధంగా వేసవికాలంలో లభించే పుచ్చకాయ లాంటి పండ్లు తినడం మంచిది. వేసవికాలంలో వదులైన కాటన్ దుస్తులు ధరించాలి. కాటన్ దుస్తులు చెమటను పీల్చుకుంటాయి. అలాగే లేత రంగు దుస్తులు వేడిమిని ఆకట్టుకోవు. వీలైనంత వరకు నీడలో ఉండేందుకు ప్రయత్నించాలి. నేరుగా సూర్య కిరణాలు పడటాన్ని నివారించాలి. ఈ ఎండాకాలం.. ఘన పదార్థాల కంటే ద్రవ పదార్థాలు తీసుకోవడం మంచిది. నూనె ఎక్కువగా ఉన్న ఆహారపదార్థాలు, వేపుళ్లు, ఫ్రైలు, సాల్టెడ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుంది. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు బయటకు వెళ్లకపోవడం మంచిది. అత్యవసరం అయితే తప్పా పగలు బయటకు వెళ్లొవద్దని ఐఎండీ సూచిస్తోంది. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల శరీరం త్వరగా డీహైడ్రేషన్ కు గురవుతుందని.. వేసవిలో ఆల్కహాల్ కు దూరంగా ఉండాలని సూచిస్తోంది. ఎండలో కార్లను పార్క్ చేసి అందులో పిల్లలను లేదా పెంపుడు జంతువులను ఎట్టిపరిస్థితుల్లో ఉంచొద్దని.. ఎండ వేడిమికి కారు లోపల వేడెక్కి పోతుంది. ఇది ప్రాణాంతకంగా కూడా మారవచ్చు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.