
స్వలింగ వివాహాల (Same-sex marriages)కు చట్టబద్ధమైన గుర్తింపు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు భాగస్వామ్యం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టు (Supreme Court)ను కోరింది. పిటిషనర్లు లేవనెత్తిన అంశాలపై వ్యాఖ్యలు, అభిప్రాయాలను తెలియజేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను తాను ఏప్రిల్ 18న కోరినట్లు బుధవారం దాఖలు చేసిన అఫిడవిట్‌లో తెలిపింది.
స్వలింగ వివాహాలకు చట్టబద్ధమైన గుర్తింపు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎస్‌కే కౌల్, జస్టిస్ ఎస్ఆర్ భట్, జస్టిస్ హిమ కొహ్లీ, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతోంది. మంగళవారం ప్రారంభమైన ఈ విచారణ బుధవారం కూడా కొనసాగింది.
సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా (Solicitor General Tushar Mehta) కేంద్ర ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తూ, స్వలింగ వివాహాలకు చట్టబద్ధమైన గుర్తింపు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు భాగస్వామ్యం ఇవ్వాలని కోరారు. అలాకాని పక్షంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో సంప్రదింపులు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలని కోరారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అభిప్రాయాలు, భయాందోళనలను సేకరించే ప్రక్రియ పూర్తయ్యే వరకు, వాటిని సర్వోన్నత న్యాయస్థానం ముందు సమర్పించే వరకు వేచి చూడాలని, ఆ తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోవాలని కోరారు.
స్వలింగ వివాహాలకు చట్టబద్ధ గుర్తింపును ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ, దాని ఫలితాల ప్రభావం దేశంపై చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంటుంది. ఈ విషయంలో సామాన్య ప్రజలకు, రాజకీయ పార్టీలకు అనేక అభిప్రాయాలు ఉన్నాయి.
మొత్తం మీద 15 పిటిషన్లపై ఈ విచారణ జరుగుతోంది. ఇద్దరు గే జంట పెళ్లి హక్కును అమలు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ కూడా విచారణలో ఉంది. ప్రత్యేక వివాహ చట్టం క్రింద పెళ్లిని నమోదు చేసుకోవడానికి సంబంధించి ఆదేశాలు జారీ చేయాలని వీరు కోరారు.




