
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మాఫియాకు ఇక చోటు లేదని, క్రిమినల్స్ ఆగడాలు అసలే ఉండబోవని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. గ్యాంగ్‌స్టర్ అతీఖ్ అహ్మద్ హత్య నేపథ్యంలో యోగి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మంగళవారం లఖ్‌నవు, హర్దోయి జిల్లాల్లో టెక్స్‌టైల్ పార్కుల ఏర్పాటుపై అవగాహన ఒప్పంద కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో యోగి మాట్లాడుతూ.. ‘‘మాఫియా సహా ప్రొఫెషనల్ క్రిమినల్స్ నుంచి పారిశ్రామిక వేత్తలకు ఇప్పుడు ఎలాంటి బెదిరింపు ఫోన్లు రావు. పారిశ్రామిక వేత్తలు ప్రశాంతంగా వారి పనిచేసుకోవచ్చు’’ అని వ్యాఖ్యానించారు. ‘‘యూపీ అంటే ఒకప్పుడు అల్లర్లకు కేరాఫ్. పలు జిల్లాల పేర్లు చెబితేనే ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెట్టేవి. ఇక, ఇప్పుడు ఆ భయం అవసరం లేదు. అందరూ ప్రశాంతంగా జీవించొచ్చు’’ అన్నారు. మాజీ సీఎం అఖిలేశ్ ప్రభుత్వంలో జరిగిన అల్లర్లను పరోక్షంగా పేర్కొంటూ విమర్శలు గుప్పించారు. ‘‘2012 నుంచి 2017 మధ్య రాష్ట్రం అల్లర్లతో అట్టుడికి పోయింది. దాదాపు 700లకు పైగా అల్లర్లు జరిగాయి. ఎక్కడబడితే అక్కడ కర్ఫ్యూలు పెట్టేవారు. దీంతో ఎక్కడ చూసినా ప్రజలు భయం గుప్పిట్లో బతకాల్సి వచ్చింది. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 2017 నుంచి 2023 మధ్య రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క ఘర్షణ, అల్లరి చోటు చేసుకోలేదు. కనీసం ఒక్క ప్రాంతంలో కూడా కర్ఫ్యూ అన్న మాటే లేదు. ఇది పెట్టుబడులకు అత్యంత అనుకూల సమయం. పరిశ్రమలను ఏర్పాటు చేసుకునే వారికి రెడ్ కార్పెట్ పరుస్తాం. ఉత్తరప్రదేశ్.. సమర్థవంతమైన శాంతిభద్రతల పరిరక్షణకు హామీ ఇస్తోంది. రాష్ట్రం శాంతి భద్రతలకు నిలయంగా మారింది’’ అని యోగి చెప్పారు. ఇదిలా ఉండగా, అతిఖ్ అహ్మద్ లాయర్ దయాశంకర్ మిశ్రా ఇంటి ముందు మంగళవారం మధ్యాహ్నం బాంబు పేలుళ్లు సంభవించాయి. అయితే, ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని, లాయర్‌ను లక్ష్యంగా చేసుకుని జరిగింది కాదని, కేవలం ఈ ప్రాంతంలో అలజడి సృష్టించాలనే ఉద్దేశంతో చేసిందేనని పోలీసులు వెల్లడించారు.
రాష్ట్రంలో పోలీస్ రాజ్!
ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన అతిఖ్, అష్రఫ్ అహ్మద్‌ల జంట హత్యలపై స్వతంత్ర విచారణకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ నెల 24 తర్వాత విచారణ జరుపుతామని మంగళవారం స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలన్న అడ్వొకేట్ విశాల్ తివారీ అభ్యర్థనను సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. కాగా, ఇదే పిటిషన్‌లో 2017 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగిన 183 ఎన్‌కౌంటర్లపైనా విచారణ జరిపించాలని పిటిషనర్ అభ్యర్థించారు. అతిఖ్, అష్ర్‌ఫల జంట హత్యలపై స్వతంత్ర నిపుణుల కమిటీ విచారించేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును అభ్యర్థించారు. ‘‘రాష్ట్రంలో ఎన్‌కౌంటర్లు చేసుకుంటూ పోతే.. ప్రజాస్వామ్యానికి అర్థం ఏముంది? రాష్ట్రం పోలీస్ రాజ్‌గా మారుతోంది’’ అని పిటిషనర్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘చట్టవ్యతిరేక హత్యలు, బూటకపు ఎన్‌కౌంటర్లకు చట్టంలో స్థానం లేదు. ఇలాంటి ఘటనలు మరిన్ని నేరాలకు దారి తీస్తాయి’’ అని పిటిషనర్ వివరించారు.
నాకేదైనా అయితే లేఖను యోగికి ఇవ్వండి
అతిఖ్ అహ్మద్ జీవించి ఉన్న సమయంలో తనకు ఒక మాట చెప్పారంటూ.. ఆయన తరఫు న్యాయవాది విజయ్ మిశ్రా మంగళవారం ఒక సంచలన విషయాన్ని వెల్లడించారు. ‘‘తనకేదైనా అయినా.. తననెవరైనా చంపేసినా.. లేక తానే చనిపోయినా.. తాను రాసిన ఒక లేఖను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, యూపీ సీఎం యోగికి పంపాలని నాకు చెప్పారు. అది సీల్డ్ కవర్. కానీ, నా దగ్గరలేదు. నా ద్వారా పంపమని కూడా చెప్పలేదు. వేరే చోట ఉంది. వేరే వ్యక్తి ద్వారా పంపించాలని మాత్రం చెప్పారు. ఆ లేఖలో విషయం ఏంటో కూడా నాకు తెలియదు’’ అని విజయ్ మిశ్రా మీడియాకు చెప్పారు. ఇదిలావుంటే.. గతంలోనే అతిఖ్ అహ్మద్ తనను అనవసరంగా వేధిస్తున్నారంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఉమేశ్ పాల్ కేసులో తనను ఇరికించారని పేర్కొన్నారు. తనకు భద్రత కల్పించాలని కోరారు. అసలు ఉమేశ్‌పాల్‌ను పోలీసులే ఎన్‌కౌంటర్ చేసి ఉంటారని అతిఖ్ సందేహం వ్యక్తం చేశారు.




