News

రామప్ప దేవాలయంలో ప్రపంచ వారసత్వ వేడుకలు….శిల్పం, వర్ణం, కృష్ణం’ పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలు

204views

యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప.. ప్రపంచ వారసత్వ వేడుకులు ఘనంగా ప్రారంభమయ్యాయి. ‘శిల్పం, వర్ణం, కృష్ణం’ పేరుతో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి మంత్రులు శ్రీనివాస్​గౌడ్​, ఎర్రబెల్లి దయాకర్​రావు, సత్యవతి రాథోడ్​లతో పాటు పలువురు ముఖ్య అతిథులుగా పాల్గోన్నారు. ఈ వేడుకల్లో ప్రముఖ కళాకారులు పాల్గొని ప్రదర్శనలతో అలరిస్తున్నారు. తనివి తీరని అద్భుత కళాకృతులకు, కాకతీయ కట్టడాలకు ఓరుగల్లు కేంద్రమైతే.. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయం.. ఇందుకు కేంద్ర బిందువు అని చెప్పాలి.

లక్షల సంఖ్యలో పర్యాటకుల మనస్సులో చెరగని ముద్ర వేసుకున్న ఈ ఆలయ విశిష్టత అంతా ఇంతా కాదు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలెంపేట గ్రామంలో పచ్చని పంట పొలాల నడుమ కొలువైన రామప్ప ఆలయం.. అపురూప శిల్పకళా సంపదకు చిరునామాగా చెప్పుకోవచ్చు. కాకతీయ చక్రవర్తి రేచర్ల రుద్రుడి హయాంలో క్రీస్తుశకం 1213లో నిర్మితమై.. మహా శిల్పి రామప్ప కళా నైపుణ్యంతో రామప్ప ఆలయం.. అద్భుతంగా, అపురూపంగా చరిత్రలో నిలిచిపోయింది. కఠిన శిలలపై కారుణ్యం ఒలకపోసే ప్రతిమలు.. సహజత్వంగా కనిపించే దేవతామూర్తులు.. మీటితే చాలు సంగీతం పలికే శిల్పాలు.. నీటిలో తేలియాడే రాళ్లతో నిర్మించిన ఆలయ పైకప్పు.. ఇలా ఎన్నెన్నో ప్రత్యేకతల సమాహారమైన రామప్ప యశస్సు.. యునెస్కో వారసత్వ గుర్తింపు పొందడంతో విశ్వవ్యాప్తమైంది.