News

బంగారం పక్క దారి పట్టలేదు….ప్రచారం కోసమే అనవసర ఆరోపణలు…. తితిదే స్పష్ఠీకరణ

217views

గోవిందరాజ స్వామి ఆలయంలోని విమాన గోపురానికి బంగారు పూత పూయించే సమయంలో 50 కిలోల బంగారం పక్కదారి పట్టిందన్న ఆరోపణల్లో వాస్తవం లేదని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది. అబద్దాలను, అసత్యాలను ప్రచారం చేస్తున్నారంటూ టీటీడీ ఈ విషయంపై ప్రకటన విడుదల చేసింది. ‘‘శ్రీగోవింద రాజ స్వామి ఆలయ విమాన గోపురం బంగారు తాపడం పనుల్లో 50 కిలోల బంగారం పక్కదారి పట్టిందని హిందూ జనశక్తి సంస్థకు చెందిన శ్రీలలిత్ కుమార్, శ్రీఆదిపట్ల కళాపీఠం అధ్యక్ష్యురాలు శ్రీమతి కరాటే కల్యాణి సోమవారం (17-4-2023) టీటీడీపై అవాస్తవ ఆరోపణలు చేశారు. తమ ఉనికిని చాటుకోవడానికి వారు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాము.’’ అని టీటీడీ తెలిపింది.

బంగారు తాపడం పనులు జరుగుతున్న పాత హుజూర్ ఆఫీసు ప్రాంగణంలో 24 గంటలూ సిసి కెమెరాల నిఘా ఉంటుంది. సంబంధిత సిబ్బంది లోనికి వెళ్ళాలన్నా. రిజిస్టర్‌లో పేరు నమోదు చేసి, ఆభరణాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు తీసేసే వెళ్ళాలి. ఇది నిషిద్ధ ప్రాంతం. స్ట్రాంగ్ రూమ్, పని జరిగే ప్రాంతంలో పూర్తి స్థాయిలో అధికారుల నిఘా, విజిలెన్స్ బందోబస్తు కూడా ఉంటుంది. ఇంతటి పటిష్టమైన ప్రాంతం నుండి 50 కిలోల బంగారం పక్కదారి పట్టించారని ఆరోపించడం వారి అజ్ఞానానికి, ప్రచార యావకు నిదర్శనం. ఆలయ శిల్ప సంప్రదాయం ప్రకారం, జీయర్ స్వాములు, అర్చకుల సలహాలు తీసుకుంటూ స్థపతుల ప్రత్యక్ష పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి. ఇక్కడ శిల్పసంపదకు ఇబ్బంది కలిగించే ఆస్కారమే లేదు. ఈ విషయం తెలుసుకోకుండా సదరు వ్యక్తులు అవగాహనా రాహిత్యంతో ఆరోపణలు చేయడం మంచిది కాదు.. అంటూ పేర్కొంది.