News

ఇచ్ఛాపురంలో స్వేచ్ఛావతి అమ్మవారి సంబరాలు ప్రారంభం

250views

ఇచ్ఛాపురం.. ఆధ్మాత్మిక శోభితంగా మారింది. విద్యుద్దీపాలంకరణలో శోభాయమానంగా కనిపిస్తోంది. గ్రామదేవత స్వేచ్ఛావతి అమ్మవారి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మే 15 వరకూ కొనసాగనున్నాయి. సోమవారం వేకువజాము నుంచే ఆలయంలో పూజలు ప్రారంభమ్యాయి. గిలాయి వంశీకులచే ప్రత్యేక పూజలు చేయించారు. అర్చకులు అశోక్‌ పాడి, సన్యాసి పాడి అమ్మవారికి సింధూర మరథన, పంచామృతాలతో అభిషేకాలు, శాంతి హోమాలు జరిపారు.రాత్రి 11.55 గంటలకు అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉప్పలవీధిలో ఉత్సవ మండపం వద్ద అమ్మవారిని ప్రత్యేక జంగిడిలో తీసుకొచ్చి కొలువుదీర్చారు. ఇక్కడ నుంచి ప్రతిరోజూ రోజుకో వార్డు చొప్పున తిరువీధి నిర్వహిస్తారు. సంబరాల చివరిరోజున స్వేచ్ఛావతి అమ్మవారిని ఆలయానికి తీసుకొచ్చి పూజలు చేస్తారు. కాగా సుదూర ప్రాంతాల నుంచి బంధువులు, స్నేహితుల రాకతో ఇచ్ఛాపురం పట్టణం కిటకిటలాడుతూ కనిపిస్తోంది. నెలరోజుల పాటు ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఏర్పాట్లు పూర్తిచేశారు. పట్టణ పరిధిలోని అన్ని వీధుల్లోనూ సుమారు 50 మండపాలను సినిమా సెట్‌ల మాదిరి సిద్ధం చేశారు.