
అభివృద్ధి చెందుతున్న దేశాలు కొన్ని రుణభారంతో కుదేలవుతున్నాయని ప్రధాని మోదీ అన్నారు. జి-20 దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంకు గవర్నర్ల రెండు రోజుల సమావేశం ప్రారంభం సందర్భంగా శుక్రవారం ఆయన ఓ వీడియో సందేశం ఇచ్చారు. వేగవంతమైన ఆర్థిక సంస్కరణలు తీసుకు రాలేకపోవడం వల్లే అంతర్జాతీయ ఆర్థిక సంస్థలపై విశ్వాసం సన్నగిల్లిందని పేర్కొన్నారు. కరోనా సృష్టించిన వినాశనానికి తోడు మోయలేని రుణభారం శ్రీలంక, పాకిస్థాన్ సహా భారత్ చుట్టు పక్కల ఉన్న దేశాలు దివాలా తీయడానికి దారితీశాయని మోదీ పేర్కొన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ చైతన్యం నుంచి ప్రపంచం ప్రేరణ పొందాలని ఆయన ఆశించారు. ఇదిలా ఉండగా, వ్యవసాయ రంగంపై 2023-24 కేంద్ర బడ్జెట్ ప్రధానంగా దృష్టి సారించిందని మోదీ మరో కార్యక్రమంలో అన్నారు. 2014కు ముందు వ్యవసాయానికి రూ.25వేల కోట్ల కంటే తక్కువ బడ్జెట్ ఉండేదని, నేడు దేశ వ్యవసాయ బడ్జెట్ అనేకరెట్లు పెరిగి రూ.125లక్షల కోట్లు దాటిందన్నారు.