
విద్యార్థుల భవిష్యత్తును, వారి రాత్రింబవళ్ల కష్టాన్ని నీరుగార్చే పేపర్ లీకేజీల వ్యవహారం దేశంలో అత్యంత తీవ్రమైన అంశం. పరీక్షల కోసం సిద్ధమయ్యే విద్యార్థులు అనుభవిస్తున్న మానసిక వేదన, వారి భవిష్యత్తుపై నెలకొన్న ఆందోళన వర్ణనాతీతం. అయితే, ఈ సున్నితమైన సమస్యను ఆసరాగా చేసుకుని దేశంలో సాగుతున్న రాజకీయాలు, ఉద్యమాల పేరిట జరుగుతున్న విపరీత పోకడలు చూస్తుంటే ఆశ్చర్యం కలగక మానదు. విద్యార్థుల హక్కుల కోసం ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడడం వేరు. కానీ అదే ఉద్యమం ముసుగులో హింసను రెచ్చగొడుతూ, మత విద్వేషాలను చిమ్మడం వెనుక ఉన్న దుర్మార్గమైన అజెండాను సమాజం ఖండించాల్సిందే.
ఇటీవల CJP వంటి సంస్థలు నడుపుతున్న ఉద్యమాల్లో అసలు డిమాండ్లు పక్కకు పోయి, RSS, హిందూ ధర్మం, మన పురాణ పురుషులను లక్ష్యంగా చేసుకుని అత్యంత నీచంగా దూషించడం జరుగుతోంది. అప్పుడు అది ఏ రకమైన పోరాటమో ఆ నిర్వాహకులకే తెలియాలి. పరీక్షల పారదర్శకతకు, మన పురాణ పురుషులకు ఉన్న సంబంధం ఏంటి? విద్యార్థుల సమస్యకు, సనాతన ధర్మాన్ని నిందించడానికి ఉన్న లింక్ ఏంటి? ఇది కేవలం విద్యార్థుల వేదికలను వాడుకుని, తమ సైద్ధాంతిక విద్వేషాలను సమాజంపై రుద్దే కుట్ర తప్ప మరొకటి కాదు. అంతేకాకుండా, నిరసనల పేరిట రోడ్లపై హింసాత్మక ఘటనలకు దిగడం, ప్రజా ఆస్తులను ధ్వంసం చేయడం ఎంతమాత్రం సమర్థనీయం కాదు. హింస ద్వారా సాధించేది ఏదీ ఉండదు. అది కేవలం విద్యార్థుల పోరాటం వెనుక ఉన్న అసలు లక్ష్యాన్ని పక్కదారి పట్టిస్తుంది.
మరొకవైపు, ఈ అంశంపై గొంతు చించుకుంటున్న ప్రతిపక్షాల నైతికత మరింత హాస్యాస్పదంగా ఉంది. I.N.D.I. కూటమి లేదా ప్రతిపక్షాలు ఏలుతున్న రాష్ట్రాల్లో లీకేజీల చరిత్ర తిరగేస్తే అసలు నిజాలు బైటపడతాయి. రాజస్థాన్‌లో గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లలో ఏకంగా 17కి పైగా పేపర్ లీకేజీలు జరిగి లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు నాశనమయ్యాయి. కేరళ, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, కర్ణాటక, తమిళనాడు.. ఇలా వారు పాలించే ప్రతీ రాష్ట్రంలోనూ పరీక్షా ప్రశ్నాపత్రాల లీకేజీల పర్వం సాగింది. బెంగాల్‌లో విద్యాశాఖ మంత్రులే జైలు పాలయ్యే పరిస్థితి వచ్చింది.
ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. తమ పాలనలో ఇన్ని పదుల సంఖ్యలో లీకేజీలు జరిగి విద్యార్థుల జీవితాలు బుగ్గిపాలవుతుంటే, నాటి ప్రభుత్వాల్లో ఏ ఒక్క విద్యాశాఖ మంత్రి గానీ, ముఖ్యమంత్రి గానీ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయలేదు. నేడు మాత్రం వీరే వీధుల్లోకి వచ్చి రాజీనామాల డిమాండ్లు, ధర్నాలు చేస్తూండడం వారి దిగజారుడు రాజకీయ ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం. తమ తప్పులను దాచిపెట్టి, ఎదుటివారిని వేలెత్తి చూపే ఈ రాజకీయం ఎంతమాత్రం విద్యార్థుల సంక్షేమం కోసం కాదు.
పేపర్ లీకేజీలకు శాశ్వత పరిష్కారం కఠినమైన చట్టాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పారదర్శక వ్యవస్థల ద్వారానే లభిస్తుంది. అంతేకానీ, రాజీనామా నాటకాలు ఆడటం వల్ల కాదు. విద్యార్థుల ఆక్రోశాన్ని రాజకీయ స్వార్థానికి, సైద్ధాంతిక విద్వేషాలకు ఇంధనంగా వాడుకుంటూ, దేశ ధర్మాన్ని దూషించే వారిని, హింసను ప్రేరేపించేవారినీ సమాజం తిరస్కరించాల్సిన సమయం ఆసన్నమైంది.





