News

దక్షిణాఫ్రికాలో 17 వేల మంది హిందువులతో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం..

29views

చాట్స్‌వర్త్ (దక్షిణాఫ్రికా): దక్షిణాఫ్రికాలో హిందూ సమాజం అపూర్వ ఐక్యతను చాటుతూ నిర్వహించిన సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం విశేషంగా ఆకట్టుకుంది. చిన్మయ మిషన్ సౌత్ ఆఫ్రికా ఆధ్వర్యంలో నిర్వహించిన “మ్యాన్ టు హనుమాన్” ఆధ్యాత్మిక కార్యక్రమంలో 17 వేల మందికి పైగా హిందూ భక్తులు పాల్గొని ఒకే వేదికపై 27 సార్లు హనుమాన్ చాలీసాను భక్తిశ్రద్ధలతో పారాయణం చేశారు.

చిన్మయ మిషన్ ప్రతినిధి శ్రీ అపరాజిత్ అయ్యర్ తెలిపిన వివరాల ప్రకారం, ఆఫ్రికా చరిత్రలో హిందువుల అతిపెద్ద ఆధ్యాత్మిక సమావేశంగా ఈ కార్యక్రమం నిలిచింది. భాష, ప్రాంతం, ఆర్థిక స్థితి వంటి భేదాలకు అతీతంగా హిందూ సమాజాన్ని ఒకే వేదికపైకి తీసుకురావాలన్న చిన్మయ మిషన్ సౌత్ ఆఫ్రికా ఆధ్యాత్మిక అధిపతి పూజ్య స్వామి అభేదానంద సరస్వతి సంకల్పం ఈ కార్యక్రమంతో సాకారమైంది.

అలాగే గ్లోబల్ చిన్మయ మిషన్ స్థాపనకు 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ మహోత్సవాన్ని నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా సనాతన ధర్మం, భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల ప్రచారానికి ఈ కార్యక్రమం ఒక విశిష్ట ఘట్టంగా నిలిచిందని నిర్వాహకులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక శుభాకాంక్షల సందేశాన్ని పంపించారు. తన సందేశంలో చిన్మయ మిషన్ సేవలను ప్రశంసిస్తూ, ప్రార్థన ద్వారా విశ్వాసం, ఆధ్యాత్మిక చైతన్యం, సామాజిక ఐక్యత మరింత బలపడతాయని పేర్కొన్నారు.

ప్రసిద్ధ భజన గాయకుడు అనూప్ జలోటా కూడా ఈ ఆధ్యాత్మిక మహాసభలో పాల్గొని భక్తులను ఆధ్యాత్మిక అనుభూతిలో ముంచెత్తారు. ఈ కార్యక్రమం దక్షిణాఫ్రికాలోని హిందూ సమాజ ఐక్యతకు, సనాతన ధర్మ వైభవానికి ప్రతీకగా నిలిచింది.