
గిరిజన మహిళల ఆర్థిక సాధికారతకు, ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహానికి మరో ముందడుగుగా పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో “ఆగ్రోఫ్రెష్” ఆదివాసీ సేంద్రీయ, చిరుధాన్యాల విక్రయ కేంద్రం ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి, పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, సీతంపేట ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి పవార్ స్వప్నిల్ జగన్నాథ్ సంయుక్తంగా కేంద్రాన్ని ప్రారంభించారు.
ఆదివాసీ మహిళా ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో, నాబార్డ్ మరియు ఆర్ట్స్ స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఏర్పాటైన ఈ విక్రయ కేంద్రం పూర్తిగా గిరిజన మహిళా రైతుల వాటాలతో నిర్వహించబడుతున్నదని కలెక్టర్ తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, “ఆగ్రోఫ్రెష్” కేవలం ఒక విక్రయ కేంద్రం మాత్రమే కాకుండా గిరిజన మహిళా సాధికారతకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. కొండ ప్రాంతాల్లోని ఆదివాసీ మహిళా రైతులు పండించే సేంద్రీయ, పోషకాహార ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అందించడం ద్వారా రైతులకు గిట్టుబాటు ధర, వినియోగదారులకు నాణ్యమైన ఆహారం అందించడమే ఈ కేంద్రం ప్రధాన లక్ష్యమని వివరించారు.
ప్రారంభం అనంతరం కలెక్టర్ దుకాణంలోని ఉత్పత్తులను పరిశీలించి, గిరిజన మహిళలు తయారు చేసిన వివిధ ఉత్పత్తుల నాణ్యత, ప్యాకేజింగ్ విధానం, సాంప్రదాయ ప్రత్యేకతలపై ఆరా తీశారు.
విక్రయ కేంద్రంలో చిరుధాన్యాలు, చిరుధాన్యాల పిండి, మిల్లెట్ స్నాక్స్, సేంద్రీయ బియ్యం, కొండ తేనె, గానుగ నూనెలు, పప్పుధాన్యాలు, అరకు ఫిల్టర్ కాఫీ, పసుపు కొమ్ములు, పసుపు పొడి తదితర ఆదివాసీ రైతు ఉత్పత్తులు అందుబాటులో ఉంచినట్లు నిర్వాహకులు తెలిపారు.
“ప్రకృతి ప్రసాదం… ఆరోగ్యకరమైన జీవనం” అనే నినాదంతో ఎలాంటి రసాయనాలు లేని స్వచ్ఛమైన సేంద్రీయ ఉత్పత్తులను ప్రజలకు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసిన ఉత్పత్తులను విక్రయించడం ద్వారా ఆదివాసీ మహిళా రైతులకు స్థిరమైన ఆదాయం లభిస్తుందని, ప్రజలు ఈ కేంద్రాన్ని ఆదరించాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.





