
బోల్గట్టి యుద్ధ విజయాన్ని గుర్తు చేసుకుంటూ, ఆరెస్సెస్ స్వయంసేవకులు కేరళలోని కొచ్చి బ్యాక్ వాటర్స్ లో ‘‘విజయభేరీ’’ పేరుతో ఘోష్ ప్రదర్శన నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆరెస్సెస్ కార్య శతాబ్ది సందర్భంగా, స్వామి వివేకానంద జయంతిని కూడా పురస్కరించుకొని యువ సాంఘీక్ లో భాగంగా చెంబిల్ అరయన్ స్మారక ఘోష్ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుడు చెంబికి నివాళులు అర్పించారు.
ప్రముఖ దేశభక్తుడైన వేలు తంపి దళవ వద్ద నావికా దళాధిపతిగా (Naval Chief) పనిచేసిన ‘చెంబిల్ అరయన్’ (పూర్తి పేరు: చెంబిల్ తైలంరంబిల్ పుతెన్‌పురాయిల్ కంకుమారన్ అనంతపద్మనాభన్ వలియ అరయన్) 1808లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చేసిన పోరాటాన్నే ‘బోల్గాట్టి యుద్ధం’ అని పిలుస్తారు.
1808 డిసెంబర్ 29వ తేదీ రాత్రి, చెంబిల్ అరయన్ దాదాపు వంద చిన్న పడవలలో తన సైన్యంతో కలిసి వెళ్లి, బ్రిటిష్ రెసిడెంట్ కల్నల్ మెకాలే ప్రధాన కార్యాలయమైన బోల్గాట్టి ప్యాలెస్‌పై మెరుపు దాడి చేశారు. ఈ అనూహ్య దాడితో ఓటమి తప్పదని భయపడిన మెకాలే, రాత్రికి రాత్రే అక్కడి నుంచి పారిపోయాడు. ఆ తర్వాత బ్రిటిష్ వారికి బందీగా చిక్కిన చెంబిల్ అరయన్, 1811 జనవరి 13న బ్రిటిష్ జైలులోనే తుదిశ్వాస విడిచారు.





