శృంగేరి నుంచి శారదా పీఠం వరకు : 76 ఏళ్ల తర్వాత కర్ణాటక నుంచి కశ్మీర్‌కు జ్ఞాన దేవత చారిత్రక ప్రయాణం

శారదా పీఠం అంటే, ఒకప్పుడు ప్రపంచమంతా వేనోళ్లా కొనియాడిన జ్ఞానానికి, వేదాంతానికి, సంస్కృత గ్రంథాలకు అదొక ముఖ్యమైన కేంద్రం. 1947లో మన దేశం విడిపోయినప్పుడు, పాకిస్తాన్ వైపు నుంచి వచ్చిన గిరిజన దొంగలు, మత ఛాందసవాదులు ఈ పీఠాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేశారు. అప్పుడు కూడా అది మన భారతదేశం సరిహద్దుల్లోనే ఉంది.
కానీ, 1949 జనవరి 1న జమ్మూ-కశ్మీర్‌లో యుద్ధం ఆగిపోవడంతో (యుద్ధ విరామం) అంతా మారిపోయింది. ఆ యుద్ధ విరామ సమయంలోనే పాకిస్తాన్, జమ్మూ-కశ్మీర్‌లో కొంత భాగాన్ని పట్టుకుంది. దాన్నే పాకిస్తాన్ ఆక్రమిత జమ్ముకశ్మీర్ (PoJK) అని పిలుస్తున్నారు. దాంతో శారదా పీఠం మన నాగరికతకు దూరం అయిపోయింది. అక్కడి పూజలు, తీర్థయాత్రలు పూర్తిగా ఆగిపోయాయి. చివరికి ఆ పీఠం మెల్లగా పాడుబడిపోయి, ఇప్పుడు శిథిలమైపోయింది.
The original Sharada Peeth located in PoJK (Pakistan Occupied Jammu and Kashmir) and the new Sharada Temple built in Teetwal, Kashmir (सोर्स लिंक: पाञ्चजन्य)
భారతదేశ మేధో చరిత్రకు ఇంతటి విలువైన కేంద్రం ఎలా పోయింది? ఇప్పుడు దాన్ని మళ్లీ ఎలా బ్రతికించుకుంటున్నామో తెలుసుకోవాలంటే, మనం 1947లో అక్కడికి వెళ్లిన చివరి తీర్థయాత్రను గుర్తు చేసుకోవాలి.
1947లో శారదా పీఠం ఆఖరి యాత్ర
1947 సెప్టెంబరులో ఆఖరిసారిగా కశ్మీరీ పండిట్ యాత్రికులు పాత దారిలో నడిచారు. వారంతా కుప్వారా నుంచి బయల్దేరి నీలమ్ లోయ వైపు వెళ్లారు. చేతుల్లో కాషాయ జెండాలు పట్టుకుని శారదా పీఠం చేరుకున్నారు. ఈ పీఠం ముజఫరాబాద్ దగ్గరలోని శారది అనే ఊరిలో ఉంది. కానీ నేడు ఈ ప్రాంతం నియంత్రణ రేఖ (LoC) అవతల పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉంది. అక్కడి ఆలయం ఇప్పుడు పైకప్పు కూడా లేని శిథిలావస్థలో ఉంది. ఒకప్పుడు గొప్ప జ్ఞాన కేంద్రంగా ఉన్న ఆ చోట, ఇప్పుడు చుట్టూ టీ స్టాల్స్, కేఫ్‌లు, సైనిక పోస్టులు కనిపిస్తున్నాయి.
ఆ రోజు నుంచి నేటివరకు మన శారదా పీఠం దాకా వెళ్లడం పూర్తిగా నిలిచిపోయింది. అందుకే భక్తులు ఏం చేశారంటే.. కశ్మీర్‌లోనే ఇంకో కొత్త శారదా మాత గుడిని కట్టుకున్నారు. ఈ నేపథ్యంలో.. కర్ణాటకలోని శృంగేరి మఠం (Sringeri Math) నుంచి శారదా దేవి యొక్క కొత్త విగ్రహం కశ్మీర్‌లోని తీత్వాల్ అనే చోటికి చేరింది. ఇది కేవలం ఒక ఆలయం ప్రారంభోత్సవం ఉత్సవం లాంటిది కాదు. ఇది 76 ఏళ్లుగా దూరమైన మన సంస్కృతి, మన నాగరికత మళ్లీ ఇంటికి తిరిగి రావడం లాంటి ఒక గొప్ప చారిత్రక ఘట్టం.
1947లో మనం శారదా పీఠానికి ఎలా దూరమైపోయాం? ఆ తర్వాత ఆ ఆలయం ఎలా శిథిలావస్థకు చేరుకుందో.. ఆ పూర్తి కథను మీకు చెప్తాం.
1947 : విభజన, యుద్ధం, ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో నిశ్శబ్దం
1947 అక్టోబరు 22న పాకిస్తాన్ కశ్మీర్‌పై దాడి చేసింది. కొన్ని రోజుల్లోనే ముజఫరాబాద్ మరియు నీలమ్ లోయ వారి ఆధీనంలోకి వెళ్లిపోయాయి. శారదా పీఠం ఆ దాడి కేంద్రానికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అందుకే అది శత్రువుల ప్రాంతంలోకి వెళ్లిపోయింది. అంతే.. వందల ఏళ్లుగా జరుగుతున్న శారదా యాత్ర ఒక్కసారిగా ఆగిపోయింది.
1930 ల వరకు ఈ యాత్ర ఎలాంటి అడ్డంకులు లేకుండా సాగింది. తర్వాత 1948 డిసెంబరు 31న యుద్ధానికి విరామం ఏర్పడింది. అక్కడే నియంత్రణ రేఖ (LoC) గీయబడింది. కశ్మీర్ రెండు ముక్కలుగా విడిపోయింది. శారదా పీఠం పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ-కశ్మీర్ (PoJK) భాగంలోకి వెళ్లిపోయింది. కనీసం ఆరో శతాబ్దం నుంచి ఉన్న ఈ పుణ్యక్షేత్రం వరకు జరిగే యాత్ర, చరిత్రలో మొదటిసారిగా, పూర్తిగా నిలిచిపోయింది. ఒక గొప్ప నాగరికత కేంద్రం పూర్తిగా నిశ్శబ్దమైపోయింది. హిందువులు అక్కడికి వెళ్లడం శాశ్వతంగా ఆగిపోయింది.
కశ్మీర్ వైపుకు తిరిగి ప్రయాణం
ఈ కొత్త ప్రయాణం దక్షిణ భారతదేశం నుంచి మొదలైంది. కర్ణాటకలోని శృంగేరి శారదా పీఠం నుంచి ఇది ప్రారంభమైంది. ఈ పీఠాన్ని ఆది శంకరాచార్యులు ఎనిమిదో శతాబ్దం చివర్లో స్థాపించారు. కశ్మీర్ జ్ఞాన-దేవత శారదా సంప్రదాయాన్ని మళ్లీ బ్రతికించడమే దీని ఉద్దేశం. 2023 మొదట్లో జగద్గురు శ్రీ భారతి తీర్థ మరియు శ్రీ విదుశేఖర భారతి కొత్త శారదా దేవి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేశారు.
ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి రెండు సంవత్సరాలు పట్టింది. 2023 మార్చి 7న విగ్రహం శృంగేరి నుంచి బయల్దేరింది. అక్కడి నుంచి 2500 కిలోమీటర్ల పొడవైన ఉత్తర యాత్ర మొదలైంది. దారిలో బెంగళూరు, హైదరాబాద్, నాగ్‌పూర్, ఢిల్లీ మరియు జమ్మూల మీదుగా ఈ యాత్ర సాగింది. ప్రతి చోటా వేలాది మంది ప్రజలు గుమిగూడారు. ఇది కేవలం విగ్రహం యాత్ర మాత్రమే కాదు.. 1947లో విడిపోయిన తర్వాత 76 ఏళ్లకు కశ్మీర్ నుంచి దూరమైన ఆ దేవత ఇంటికి తిరిగి రావడం లాంటిది.
నియంత్రణ రేఖ దగ్గర కొత్త ఆలయం
2023 మార్చి 20న శారదా దేవి తీత్వాల్ చేరుకుంది. ఈ చోటు కుప్వారా జిల్లాలో ఉంది ఇంకా అది నియంత్రణ రేఖ (LoC)కు కేవలం 2.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడే గతంలో ఒక శారదా గుడి ఉండేది. అది 1947 అక్టోబరులో కబాయీల దాడిలో నాశనమైంది. స్థానిక సంస్థలు, భక్తులు దాన్ని మళ్లీ కట్టించారు. కొత్త గుడిని 2023 మార్చి 22న తెరిచారు. ఈ తేదీ కశ్మీరీ నవరేహ్ (ఉగాది/నూతన సంవత్సరం)తో ముడిపడి ఉంది. గుడి సరిగ్గా సరిహద్దుకు అవతల ఉన్న అసలు శారదా పీఠం వైపు చూస్తున్నట్టుగా నిర్మించారు. విభజన తర్వాత మొదటిసారిగా శారదా దేవి పూజ మళ్లీ కశ్మీర్ హిమాలయ లోయల్లో, భారత భూమిపై మొదలైంది.
కొత్త గుడి ఎందుకు అవసరమైంది?
76 ఏళ్లుగా శారదా పీఠం యాత్ర ఆగిపోయాక, కొత్త గుడి కట్టడం అనేది చారిత్రక అవసరంగా మారింది. శారదా పీఠం ఒకప్పుడు కశ్మీరీ పండిట్ల గుర్తింపునకు మేధో కేంద్రం. నీలమత పురాణం (6వ-8వ శతాబ్దం) మరియు కల్హణుడు రాసిన రాజతరంగిణి (1148-1150)లో దీన్ని కశ్మీర్ జ్ఞాన-దేవత స్థానంగా చెప్పారు. 1947 వరకు ప్రతి సంవత్సరం ఇక్కడికి యాత్ర జరిగేది. దేశ విభజన.. శారదా సంప్రదాయాన్ని దాని పుట్టిన స్థలం నుంచే దూరం చేసినట్లైంది. ఇప్పుడు తీత్వాల్‌లో కొత్త గుడి కట్టడం వల్ల, పాత యాత్ర సంప్రదాయం మళ్లీ బ్రతికింది. సాంస్కృతిక జ్ఞాపకాలు మళ్లీ తాజా అయ్యాయి. అసలు స్థలం ఇంకా వేరే వాళ్ల ఆధీనంలో ఉన్నప్పటికీ, కశ్మీర్ జ్ఞాన-దేవత ఇప్పుడు మళ్లీ తన లోయకు తిరిగి వచ్చింది.
సరిహద్దు అవతల అసలు గుడికి ఏమైంది?
నియంత్రణ రేఖ అవతల ఉన్న అసలు శారదా పీఠం పరిస్థితి రోజురోజుకు దారుణంగా తయారైంది. 1915లో ఔరేల్ స్టీన్ ఇక్కడి ఫొటోలు తీసినప్పుడు, గుడి చాలా పటిష్టంగా, సురక్షితంగా ఉంది. 1931లో ఆర్కియాలజిస్ట్ ఆర్.సి.కాక్.. దీనిని పూర్తిగా చెక్కు చెదరనిదిగా చెప్పారు. గర్భగుడి, పై కప్పు కూడా అన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు పాకిస్తాన్ ఆక్రమిత ఈ ప్రాంతంలో పైకప్పు కూలిపోయింది. రాతి ముక్కలు పెద్ద మొత్తంలో మాయమయ్యాయి. ఎలాంటి ప్రభుత్వ పర్యవేక్షణ లేదు. 2017 నుంచి 2023 మధ్య వచ్చిన రిపోర్టులు చూస్తే, గుడి ప్రాంగణం చుట్టూ టీ స్టాల్స్, కేఫ్‌లు, సైనిక పోస్టులు కట్టారు. దక్షిణ ఆసియాలోనే అత్యంత పురాతన విశ్వవిద్యాలయాల్లో ఒకదాన్ని ఈ విధంగా నాశనం చేస్తున్నారు. ఈ నిర్లక్ష్యం అనుకోకుండా జరిగింది కాదు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లో.. ఇస్లాం కంటే ముందున్న వారసత్వం పట్ల ఉన్న వ్యవస్థాగత ఉదాసీనత (Institutional Indifference) దీనికి కారణం.
కొత్త గుడి ఏం చెప్తోంది?
తీత్వాల్‌లో 2023 లో కొత్తగా నిర్మించిరన శారదా ఆలయం అనేది.. గతంలో కోల్పోయిన చరిత్రను మళ్లీ బ్రతికించడం లాంటిది. సరిహద్దులు మనుషులను, ప్రాంతాలను విడదీయవచ్చుగానీ.. మన జ్ఞాపకాలను, మన సంస్కృతిని మాత్రం విడదీయలేవని ఇది గట్టిగా చెప్తోంది. నియంత్రణ రేఖ (LoC) నుంచి కొన్ని మీటర్ల దూరంలో నిలబడిన ఈ ఆలయం, సరిగ్గా ఎదురుగా శిథిలమై ఉన్న అసలు శారదా పీఠం వైపు కాపలా కాస్తున్నట్టుగా చూస్తోంది. ఇది భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేని ఒక నిజాన్ని గుర్తు చేస్తోంది. పవిత్రమైన స్థలాలు అనేవి మనం వాటిని గుర్తు చేసుకునేంతవరకు, వాటిని మళ్లీ కట్టుకునేంత వరకు, వాటిని మన జీవితంలో భాగం చేసుకునేంతవరకు, అవి బ్రతికే ఉంటాయి. అసలు శారదా పీఠాన్ని మళ్లీ భద్రపరిచి, దానికి దాని పాత గుర్తింపు (ప్రపంచ-స్థాయి సంస్కృత జ్ఞాన-కేంద్రం) తిరిగి వచ్చే వరకు, ఈ కొత్త గుడి మనకు ఒక భరోసా ఇస్తుంది. 1947లో దూరమైన హిందూ నాగరికత, తన జ్ఞాన కేంద్రాలను ఎప్పటికీ అంతరించిపోనివ్వదు అనే స్పష్టమైన సందేశాన్ని ఈ ఆలయం ఇస్తోంది.





