
ప్రాచీన వైద్య విధానం మన దేశ వారసత్వ సంపద అని.. ఆయుర్వేదం, యోగా, ప్రకృతివైద్యం, యునాని, సిద్ధ, హోమియోపతి (ఆయుష్)పై ప్రజల్లో పెద్దఎత్తున అవగాహన కల్పించి, ప్రభుత్వాల చొరవ, ఏర్పాట్లను సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులకు సూచించారు. కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఇగ్నైట్ సెల్‌ను ఏర్పాటు చేశారు. కలెక్టరేట్‌కు వివిధ పనులపై వచ్చే సందర్శకులకు వైద్యాధికారులు ఆయుష్ విశిష్టతపై అవగాహన కల్పించారు. కొందరిని పరీక్షించి, ఔషధాలు అందించారు. కలెక్టర్ లక్ష్మీశ ఇగ్నైట్ సెల్‌ను సందర్శించి ఆయుష్ వైద్యులకు వివిధ సూచనలు చేశారు. జిల్లాలో ఏడు ఆయుష్మాన్ మందిర్‌లు, ఆరు ఆయుష్ డిస్పెన్సరీలు ఉన్నాయని.. అదేవిధంగా విజయవాడలో డా. ఆచంట లక్ష్మీపతి ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల, డా. నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల ఉన్నాయని, వీటిద్వారా మెరుగైన సేవలు అందించేలా అధికారులు కృషిచేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం సుసంపన్న, ఆరోగ్య, ఆనంద ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా స్వర్ణాంధ్ర విజన్ @ 2047ను ఆవిష్కరించడం జరిగిందని.. ఆరోగ్య ఆంధ్ర సాధనలో ఆయుష్ విభాగం కూడా కీలకపాత్ర పోషించాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు.





