
( డిసెంబరు 31 – కూర్మ ద్వాదశి )
శ్రీమహావిష్ణువు అవతారాల్లో కూర్మావతారం రెండోది. ‘నీ వీపు మీద భూమిని మోస్తున్న ఓ కేశవా! తాబేలు రూపాన్ని ధరించిన ఓ జగదీశా! నీకు జయం’ అంటూ జయదేవుడు కూర్మావతారాన్ని స్తుతించాడు. పుష్యమాసంలో శుద్ధ ద్వాదశి కూర్మ ద్వాదశి. ఒక సందర్భంలో ఇంద్రుడిపై ఆగ్రహించిన దూర్వాస మహర్షి- దేవతలు శక్తిహీనులవుతారని శపించాడు. ఆ శాప కారణంగా దేవతలు రాక్షసుల చేతిలో ఓడిపోవడం ప్రారంభమైంది. దాంతో దేవతలంతా విష్ణుమూర్తిని ఆశ్రయించారు. పాలకడలిని చిలికి అమృతాన్ని సాధిస్తే సమస్య తొలగుతుందన్నాడు విష్ణువు. స్వామి సూచన మేరకు ఆ మహత్కార్య సాధనలో భాగంగా దేవతలు దానవులతో సంధి కుదుర్చుకున్నారు. మందర పర్వతం కవ్వంగా, వాసుకి తాడుగా.. పాల సముద్ర మథనం మొదలయ్యింది. కానీ మందరగిరి సముద్రంలో మునిగిపోసాగింది. ఆ తలపెట్టిన కార్యం విఫలమయ్యే పరిస్థితి ఉత్పన్నమై.. దేవతలు మరోసారి విష్ణువును ప్రార్థించారు. శ్రీహరి బ్రహ్మాండ పరిమాణాన్ని తలపిస్తూ మహాకూర్మరూపంలో అవతరించాడు. పాలసముద్రంలో మునిగిపోయిన మందర పర్వతాన్ని తన వీపుమీద నిలిపాడు. మళ్లీ సాగర మథనం కొనసాగి.. చివరిగా అమృతం లభించింది. విష్ణుమూర్తి మోహినీ రూపం దాల్చి ఆ అమృతాన్ని పంచడంతో దేవతలు బలం పుంజుకొని అమరులయ్యారు. రాక్షసుల్ని ఓడించి పాతాళానికి అణిచేశారు. ఇందులోని అంతరార్థాన్ని కైవల్యోపనిషత్తు వివరించింది. మనలో ఉండే మంచి, చెడులే దేవతలు, రాక్షసులు. బుద్ధి అనే మందర పర్వతాన్ని కవ్వంగా, అహంకారం అనే వాసుకిని తాడుగా చేసుకొని మనసనే క్షీరసాగరాన్ని చిలికితే జ్ఞానామృతం వెలువడుతుంది. ఈ విషయాన్నే ఆదిశంకరులు ‘వేదాంత సాగరాన్ని మథిస్తే చివరి ఫలితంగా మోక్షమనే అమృతం లభిస్తుంది’ అన్నారో సందర్భంలో.
పోతన భాగవతంలో కూర్మావతారం గురించి చాలా చక్కగా వర్ణించారు. కూర్మం తన శరీరాన్ని లోనికి ముడుచుకుని స్థిరంగా ఉంటుంది. మన ఇంద్రియాలను లౌకిక విషయాల నుంచి మరల్చినప్పుడు జీవనయానంలో మందర పర్వతమంత బరువును భరిస్తూ కూడా, స్థిరంగా ఉండగలరన్నదే కూర్మావతారం ఇచ్చే సందేశం. కూర్మం కాలస్వరూపానికి చిహ్నం. కదలాలని అనిపించినప్పుడు మెల్లగా కదులుతుంది. వద్దనుకున్నప్పుడు స్తంభించిపోతుంది. స్థితప్రజ్ఞత్వానికి, దృఢచిత్తానికి కూర్మాన్ని సంకేతంగా చెబుతారు. ఈ లక్షణాలు సాధకుడికి తప్పనిసరిగా ఉండాలి. సర్వోత్కృష్టమైన చైతన్యంతో నారాయణుడు కూర్మావతారం దాల్చి అమృత సిద్ధిని చేకూర్చాడు. కూర్మ అవతారాన్ని పూజిస్తే సకల పాపాలూ హరిస్తాయని అగ్నిపురాణం పేర్కొంది.
శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మంలో శ్రీహరి కూర్మావతారంలో ఉన్న ఆలయం ఉంది. అక్కడ కూర్మశైలంపై కూర్మనాథస్వామి అవతరించాడు. విష్ణుతీర్థుడనే భక్తుడి తపస్సుకు మెచ్చి విష్ణువు కూర్మరూపంలో అక్కడ వెలిసాడని పురాణ వచనం. ఎక్కడాలేని విధంగా శ్రీకూర్మనాథస్వామి ఆలయంలో రెండు ధ్వజస్తంభాలుంటాయి. కర్పూరేశ్వరుడు, హఠకేశ్వర, సుందరేశ్వర, కోటేశ్వర, పాతాళ సిద్ధేశ్వరులతో ఇది పంచలింగారాధ్య క్షేత్రం కూడా.





