
బంగ్లాదేశ్ చొరబాటుదారులు అస్సాంలోనే కాకుండా.. దేశంలో ఎక్కడున్నా పంపించేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. అస్సాంలో నిర్వహించిన బహిరంగ ర్యాలీలో పాల్గొన్న అమిత్‌షా మాట్లాడుతూ.. పొరుగు దేశం నుంచి రాష్ట్రంలోకి చొరబడిన బంగ్లాదేశీయులు ఇక్కడి ప్రజల సంస్కృతి, గుర్తింపులపై బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. అటువంటి వారిని కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా భావిస్తోందన్నారు. ఆ ఓటుబ్యాంకును రక్షించుకునేందుకే ప్రతిపక్ష కూటమి ఓటరు జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ(ఎస్‌ఐఆర్)ను వ్యతిరేకిస్తోందని ఆరోపించారు.
అస్సాంలో కాంగ్రెస్ ఎన్నోఏళ్లు అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి చేయలేదని అమిత్ షా అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ప్రజల సాంస్కృతిక గుర్తింపును కాపాడటమే కాకుండా రాష్ట్ర సమగ్ర అభివృద్ధిపైనా దృష్టి పెట్టారన్నారు. బంగ్లాదేశ్ చొరబాటుదారులు ఆక్రమించుకున్న లక్షకు పైగా బిఘాల భూమిని ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం విడిపించిందని అమిత్ షా అన్నారు. రాష్ట్రంలో పాగా వేసిన చొరబాటుదారులను పూర్తిగా నిర్మూలించడానికి భాజపాకు మరో అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. గత 11 ఏళ్లలో భాజపా ప్రభుత్వం రాష్ట్రంలోని పలు మిలిటెంట్ సంస్థలతో శాంతి ఒప్పందాలు చేసుకుందన్నారు.





