News

మరింత నాణ్యతతో సత్యదేవుని ప్రసాదాలు

237views

అన్నవరం సత్యదేవుని ప్రసాదం మరింత నాణ్యతతో భక్తులకు అందించాలని ఈవో వి.త్రినాధరావు ఆ విభాగ అధికారులను ఆదేశించారు. నాణ్యత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినా, భక్తుల నుంచి ఫిర్యాదులు వచ్చినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రసాదం నాణ్యతపై సామాజిక మాధ్యమాల్లో ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. ఆ విభాగ అధికారులు, సిబ్బంది, వంట స్వాములతో\ సమీక్షించారు. ప్రసాదం తయారీకి వినియోగించే గోధుమ నూక, నెయ్యి, పంచదార తదితర సరకులు ఏ పరిమాణంలో వాడుతున్నారో ఆరా తీశారు. నిబంధనల ప్రకారం నాణ్యమైన గోధుమలు కొనుగోలు చేయాలని, దిట్టం ప్రకారం (అధికారుల నిర్ణయించిన పరిమాణం) తయారీకి సరకులు వినియోగించాలని ఆదేశించారు. ఆకస్మికంగా ప్రసాదం విక్రయ కౌంటర్‌ నుంచి ప్యాకెట్టు తెప్పించుకున్నారు. నాణ్యత, రుచి పరిశీలించారు. ఎక్కువ కాలం నిల్వ ఉండటం లేదన్న ఆరోపణల నేపథ్యంలో కొన్ని ప్యాకెట్లను ఉంచుకున్నారు. రెండ్రోజుల తర్వాత కూడా వాటి రుచిని పరిశీలించనున్నారు. ప్రసాదం తయారీ విధానాన్ని ఆయన పర్యవేక్షించనున్నారు. ప్యాకింగ్‌ సిబ్బందికి అందుతున్న కమిషన్, దేవస్థానం నుంచి చెల్లింపుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.