
225views
చంద్రయాన్-4 ద్వారా చంద్రునిపై నమూనాలను తీసుకొచ్చేందుకు ఏఐ సాంకేతికత ఉపయోగించనున్నట్లు ఇస్రో ఛైర్మన్ నారాయణన్ తెలిపారు. తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ ఏడాది డిసెంబరు చివరి నాటికి మానవరహిత అంతరిక్ష యాత్ర చేపట్టనున్నామని, అందులో వయోమిత్ర అనే రోబోను పంపుతామని చెప్పారు. ఇది పూర్తయ్యాక మరో రెండు మానవరహిత రాకెట్లు ప్రయోగిస్తామని, 2027 మార్చిలో మనుషులను పంపుతామని తెలిపారు. గగన్‌యాన్ ప్రాజెక్టులో 85శాతం పరీక్షలు పూర్తయ్యాయని వెల్లడించారు. రాకెట్‌లో ప్రమాదం జరిగితే మనుషులను సురక్షితంగా ఎలా తీసుకురావాలో కూడా అధ్యయనం చేస్తున్నామన్నారు. ఈ తరం విద్యార్థులు అంతరిక్ష సంబంధిత విషయాలపై ఆసక్తి చూపుతున్నారని నారాయణన్ వివరించారు.





