News

బంగ్లా చొరబాటుదారులకు సహకరిస్తున్న నెట్‌వర్క్‌లపై చర్యలు

451views

అక్రమంగా దేశంలోకి ప్రవేశిస్తున్న బంగ్లాదేశీయులు, రొహింగ్యాలకు సహకరిస్తున్న నెట్‌వర్క్‌లపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్రహోంమంత్రి అమిత్‌ షా దిల్లీ పోలీసులను ఆదేశించారు. జాతీయ భద్రతకు ముప్పుగా మారిన ఈ అంశంపై కఠినంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. దేశరాజధాని దిల్లీలో శాంతిభద్రతల పరిస్థితిపై ఆయన సమీక్ష నిర్వహించారు. పేలవమైన పనితీరు కనబరుస్తున్న పోలీసు స్టేషన్లు, సబ్‌డివిజన్లపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. నగరంలో అరాచకం సృష్టించే అంతర్రాష్ట్ర ముఠాలను నిర్దాక్షిణ్యంగా తుదముట్టించడమే పోలీసుల ప్రథమ కర్తవ్యం కావాలన్నారు. మాదకద్రవ్యాల కేసుల్లో చర్యలు తప్పకుండా తీసుకోవాలని, వాటికి సంబంధించిన నెట్‌వర్క్‌లను కూకటివేళ్లతో పెకలించాలని అమిత్‌ షా అధికారులను ఆదేశించారు. 2020 అల్లర్ల కేసులను త్వరగా పరిష్కరించే విషయంలో దిల్లీ పోలీసుల అనుమతులు అవసరం లేదని ప్రకటించారు. ఈ అంశంలో దిల్లీ ప్రభుత్వం ప్రత్యేక న్యాయవాదులను నియమించుకోవాలని సూచించారు. ఈ సమీక్ష సమావేశానికి దిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, హోంమంత్రి అశిష్‌ సూద్, దిల్లీ పోలీసు కమిషనర్‌ సంజయ్‌ అరోడా సహా పలువురు సీనియర్‌ అధికారులు హాజరయ్యారు.