
విజయవాడ పాతబస్తీలోని శివాలయాలకు ఘన చరిత్ర ఉంది. నిత్యం భక్తులతో కళకళలాడే ఆలయాల నుంచి సీజీఎఫ్ వసూలు చేసే దేవాదాయ శాఖ అధికారులు వీటి అభివృద్ధి గురించి పట్టించుకోవడం లేదని పలు ఆరోపణలు విన్పిస్తున్నాయి. శ్రీభ్రమరాంబ మల్లేశ్వర స్వామి దేవస్థానం(పాత శివాలయం)లో గాలి గోపురం నిర్మాణం చేసి వందల ఏళ్లు గడిచింది. గానుగ సున్నంతో కట్టిన గోపురం ప్రస్తుతం క్షీణ దశకు చేరుకొంది. దానికి మరమ్మతులు చేయించక పోవడంతో ప్రమాదకరంగా మారింది. ఈ క్రమంలో గాలి వానలు వచ్చినప్పుడు అది కూలిపోయే ప్రమాదం కూడా ఉంది.
నివేదిక దస్త్రాల్లోనే..
ఈ గోపురం చుట్టు దుకాణాలు, వ్యాపార అవసరాల నిమిత్తం వచ్చే వినియోగదారులతో కిటకిటలాడుతుంటోంది. ఏడేళ్ల క్రితమే దీనికి మరమ్మతులు చేయాల్సిన అవసరంపై ఇంజినీరింగ్ అధికారులు ఇచ్చిన నివేదిక దస్త్రాల్లోనే నిక్షిప్తమైంది. గత మూడేళ్లుగా ఆలయ గోపురానికి విద్యుద్ధీకరణ పెట్టే పరిస్థితి లేదు. వీటి కోసం దీపాలు దండలు వేస్తే పెచ్చులు ఊడి పోతున్నాయని దేవస్థానం సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రయోజనం లేదు
వన్‌టౌన్ బ్రాహ్మణ వీధిలోని వసంత మల్లికార్జున స్వామి ఆలయానికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. 2016లో దుర్గగుడి దత్త దేవాలయంగా మారిన తర్వాత దీని పరిస్థితి ఘోరంగా తయారైంది. ఆలయానికి చెందిన స్థలంలో దుర్గగుడి ప్రసాదాల పోటు ఏర్పాటు చేశారు. దేవస్థానానికి మాత్రం ఎటువంటి ప్రయోజనం లేకపోగా ప్రసాదాల పోటు నుంచి వచ్చే పొగతో ఆలయ గోపురం నల్లగా మారింది.ఈ విషయాన్ని రెండున్నర ఏళ్ల కిందట అప్పటి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దృష్టికి భక్తులు తీసుకెళ్లారు.
దాతల సహకారంతో..
రెండేళ్ల కిందట ఆలయాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి చేర్చారు. దీన్ని దేవాదాయ శాఖ పట్టించుకోనప్పటికి దాతల సహకారంతో ఆలయం చుట్టూ ఫ్లోరింగ్, రంగులు, దేవతామూర్తుల చిత్రపటాలతో అందంగా తీర్చిదిద్దారు. దాసాంజనేయ స్వామి, నవగ్రహాల ఆలయాలను సైతం అభివృద్ధి చేశారు. అయితే ప్రధానంగా మసిబారిన గోపురానికి మాత్రం ఏమి చేయాలో అర్థం కాక దాతలు, భక్తులతో పాటు అర్చకులు తలపట్టుకుంటున్నారు.
ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం
పాత శివాలయ గోపురం జీర్ణావస్థకు చేరిన విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తాం. శాండ్ ప్లాస్టింగ్ చేయడం ద్వారా గోపురాన్ని పరిరక్షించేందుకు చర్యలు చేపడతాం. వసంత మల్లికార్జున స్వామి ఆలయ గోపురం మసిబారిన విషయం ఇటీవల తన దృష్టికి వచ్చింది. దీనిపై భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా చర్యలు తీసుకుంటాం.-నటరాజన్ షణ్ముఖం, వెంకట రెడ్డి, ఆలయ ఈవోలు




